కేంద్రానికి చేరిన ఆర్‌ఆర్‌ఆర్‌ డీపీఆర్‌

ప్రధానాంశాలు

కేంద్రానికి చేరిన ఆర్‌ఆర్‌ఆర్‌ డీపీఆర్‌

3 రకాల ప్రతిపాదనలు చేసిన కే అండ్‌ జే ప్రాజెక్ట్స్‌
అధ్యయనం చేయనున్న జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) సవివర నివేదిక (డీపీఆర్‌) కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు అందింది. దీనిపై సదరు శాఖ త్వరలో అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం డీపీఆర్‌ను రూపొందించే టెండరు దక్కించుకున్న మహారాష్ట్రకు చెందిన కే అండ్‌ జే ప్రాజెక్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ మూడు ప్రతిపాదనలుగా నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ మూడింటిని పరిశీలించి ఒక మార్గాన్ని మంత్రిత్వ శాఖ ఆమోదించి భూ సేకరణ ప్రక్రియకు అనుమతి ఇస్తుంది. ఆ తరవాత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి నోటీసులు జారీ చేస్తుంది. భూ సేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించనున్నాయి. హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డుకు ఆవల నుంచి 362 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా ప్రాంతీయ రింగు రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-భువనగిరి-చౌటుప్పల్‌ 158 కిలోమీటర్ల మేరకు దక్షిణ భాగంగా ప్రతిపాదించారు. దానికి కేంద్రం జాతీయ రహదారి నంబరూ కేటాయించింది. ప్రతిపాదన రూపొందించాక దక్షిణ భాగంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. గతంలో రూపొందించిన ప్రాథమిక నివేదికలో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం కేంద్రానికి లేఖ ఇచ్చారు. ఆ అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని మొత్తం మూడు రకాలుగా డీపీఆర్‌ ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ క్రమంలో దక్షిణ భాగం ఆర్‌ఆర్‌ఆర్‌ నిడివి 165 కిలోమీటర్లకు పైగా పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని