హిమగిరి సొగసులు.. సరికొత్త మెరుగులు

ప్రధానాంశాలు

హిమగిరి సొగసులు.. సరికొత్త మెరుగులు

కఠిన వాతావరణ పరిస్థితుల్లో కశ్మీరులో నిర్మాణాలు
అమర్‌నాథ్‌ యాత్రకు తగ్గనున్న దూరం  
జోజిలా సొరంగం నిర్మాణంలో తెలుగు ఇంజినీర్లు
కశ్మీర్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

ముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తున ఉన్న హిమసానువులవి.. గడ్డ కట్టుకుపోయే చలి.. హఠాత్తుగా మేఘాలు కమ్ముకుని వర్షం కుమ్మరించేస్తాయి. శరీరాన్ని కత్తులతో కోస్తున్నట్లుండే చలిగాలి.. వాతావరణపరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు. వీటికితోడు కఠినమైన శిలలతో కూడిన హిమాలయ పర్వతాలు. శ్రీనగర్‌ - లద్దాఖ్‌ మార్గంలో బాల్తాల్‌ ప్రాంతమది. అక్కడ పనిచేయాలంటే ఎన్నో సవాళ్లు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో హిమసానువుల్ని తొలిచి సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కో లోయను అనుసంధానం చేసుకుంటూ.. నదుల్ని దాటుకుంటూ దేశ రక్షణపరంగా, పర్యాటకపరంగా కీలకమైన రహదారిని పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో తెలుగువారైన ఇంజినీరింగ్‌ నిపుణులే కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇరవై అడుగులు నడిస్తే చాలు శ్వాస భారంగా అనిపించే హిమగిరుల్లో కొనసాగుతున్న పనుల తీరుపై ‘ఈనాడు’ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనమిది..

కశ్మీరు లోయలో జోజిలాపాస్‌ కనుమ పైభాగం నుంచి పర్వతాలను పాములా చుట్టుకుని మెలికలు తిరుగుతూ సాగిపోయే లద్దాఖ్‌ ఘాట్‌రోడ్డు. అక్కడికి దిగువ భాగంలో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమయ్యే రెండు మార్గాల్లో ఒకటైన బాల్తాల్‌ ఉంటుంది. యాత్రికులకు గుర్రాలు, హెలికాప్టర్‌ సేవలు అక్కడి నుంచే మొదలవుతాయి. సొరంగం మార్గం ప్రారంభమయ్యేది అక్కడే. ఐదు కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన (యంగ్‌ హిల్స్‌) పర్వతాన్ని ప్రత్యేక యంత్రాలతో తొలుస్తున్నారు. మొత్తం 14.15 కిలోమీటర్ల మార్గమంతా భారీ పర్వతాల కింది నుంచే సాగుతుంది. లోపల లైటింగ్‌ సౌకర్యం, అగ్నిప్రమాదం సంభవిస్తే దానంతట అదే నీటిని వెదజల్లే యంత్రాలు, లోపలికి గాలి ప్రసరించేలా 400 మీటర్ల పైనుంచి ఏర్పాట్ల వంటివి చేస్తున్నారు.

రోజుకు 8 మీటర్ల తవ్వకం

కాళేశ్వరం ఎత్తిపోతల సొరంగాల నిర్మాణంలో వినియోగించిన పద్ధతుల్లో కొన్ని ఇక్కడా అమలు చేస్తున్నారు. బూమర్‌ అనే ప్రత్యేక యంత్రంతో శిలలకు రంధ్రాలు చేసి ఎయిర్‌ బ్లాస్టింగ్‌తో తొలగిస్తున్నారు. రోజుకు గరిష్ఠంగా 8 మీటర్ల పని జరుగుతోంది. లోపల ప్రాణవాయువు అందడం కష్టంగా ఉంది. వెంటిలేషన్‌ మోటార్లను వినియోగిస్తున్నారు. శీతాకాలంలో ఉష్ణోగ్రత -40 డిగ్రీలకు పడిపోయే ఈ ప్రాంతంలో పనులు వేగంగా పూర్తిచేసేందుకు మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.

యాత్రికులకు గొప్ప ఊరట

శ్రీనగర్‌ మీదుగా అమర్‌నాథ్‌ యాత్రకు వచ్చే భక్తులకు కష్టాలు తప్పనున్నాయి. సోన్‌మార్గ్‌ సమీపంలో ఏటా కొండచరియలు విరిగి పడటం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు రోజుల తరబడి యాత్ర నిలిచిపోతుంది. ఇక్కడి నుంచి జోజిలాపాస్‌ సొరంగం వరకు 18.47 కిలోమీటర్ల అప్రోచ్‌రోడ్‌, రెండు సొరంగాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. మూడు భారీ వంతెనలు, మంచు జారి పడే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రహదారి నిర్మిస్తున్నారు. శ్రీనగర్‌ నుంచి వచ్చే భక్తులు 90 కిలోమీటర్లు ప్రయాణించి బాల్తాల్‌ వద్దకు చేరడం సులువవుతుంది.  

తెలుగు ఇంజినీర్లే కీలకం  

ప్రతిష్ఠాత్మక జోజిలా సొరంగం నిర్మాణంలో 1500 మంది పాల్గొంటుండగా వారిలో 200 మంది నిపుణులు ఉన్నారు. ఎక్కువమంది తెలుగువారే. ప్రాజెక్టు జనరల్‌ మేనేజర్‌ అంగర సతీష్‌బాబు పోలవరం నిర్మాణంలో పనిచేశారు. మరో జీఎం శ్రీరామమూర్తి, సీజీఎం శ్రీనివాస్‌, డీజీఎం నజార్‌వలీ జోజిలా వైపు పనులను పర్యవేక్షిస్తున్నారు. లద్దాఖ్‌ వైపు మీనామార్గ్‌ నుంచి సముద్ర మట్టానికి 3,295 మీటర్ల ఎత్తులో తవ్వుతున్న సొరంగాన్నీ తెలుగునిపుణులే పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు అధికారిగా ప్రశాంత్‌ ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని