నర్సులూ మందుల చీటీ రాస్తారు

ప్రధానాంశాలు

నర్సులూ మందుల చీటీ రాస్తారు

బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసిన వారికి ఆర్నెల్ల శిక్షణ
ప్రాథమిక వైద్యంలో వినియోగం
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు

ఈనాడు - హైదరాబాద్‌: ఇప్పటి వరకూ మందుల చీటీ(ప్రిస్క్రిప్షన్‌)ని వైద్యులు మాత్రమే రాస్తున్నారు. ఈ అవకాశాన్ని ఇక నుంచి నర్సులకు కూడా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన వారికి ఆర్నెల్ల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయుల్లో ప్రాథమిక వైద్యంలో వినియోగించవచ్చని పేర్కొంది. జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)లో ఇప్పటికే ఆరోగ్య ఉప కేంద్రాల్లో ‘మిడ్‌ లెవల్‌ కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్‌’గా నర్సుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ తరహా ఆలోచన వైద్యరంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. పలు సూచనలు చేస్తూ భారత్‌లో నర్సింగ్‌ సేవలపై తాజాగా నివేదికను విడుదల చేసింది.


గ్రామీణంలో వైద్యుల కొరత

‘‘ప్రాథమిక వైద్యంలో వైద్యులకు, నర్సులకు మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదు. అమెరికా, యూకే తదితర దేశాల్లోనూ ప్రాథమిక వైద్యంలో నర్సులు మందుల చీటీలను సొంతంగా రాస్తున్నారు. భారత్‌లో పరిస్థితులకూ ఈ విధానం సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ గ్రామీణంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతమున్న చట్టంలో మార్పులు తెచ్చి, నర్సులు మందుల చీటీ రాయడానికి వీలుగా సవరణలు చేయాల్సి ఉంది. నర్సింగ్‌ విద్యలోనూ విప్లవాత్మక మార్పులు తేవాలి. మందుల చీటీ రాయడానికి అవకాశమివ్వడానికంటే ముందే శిక్షణను అందించాలి. ప్రాథమిక వైద్యాన్ని బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులోనే ప్రవేశపెట్టాలి’’ అని సూచించింది.


ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం

‘‘ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ప్రత్యేకంగా నిర్ణీత కోర్సు చేసిన ‘కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్ల’కు మందుల చీటీ రాసే అవకాశాన్ని కల్పించారు. ‘రూరల్‌ మెడికల్‌ అటెండర్‌(ఆర్‌ఎంఏ)’ వ్యవస్థ అమల్లో ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని