హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

ప్రధానాంశాలు

హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

వారిలో నలుగురు మహిళలు

సుప్రీంకోర్టు కొలీజియం

సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం

ఈనాడు, దిల్లీ; ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 17న చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి యథాతథంగా ఆమోదముద్ర వేశారు. హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టనున్న వారిలో ఇప్పటివరకు జ్యుడిషియల్‌ ఆఫీసర్లుగా పనిచేసిన పి.శ్రీసుధ, సి.సుమలత, జి.రాధారాణి, ఎం.లక్ష్మణ్‌, ఎన్‌.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌కంట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో జ్యుడిషియల్‌ సభ్యురాలిగా సేవలందించిన పి.మాధవిదేవి ఉన్నారు.

వీరితోపాటు ఒడిశా హైకోర్టుకు ముగ్గురు, కేరళ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో ఒకేరోజు 14 మంది నియామకానికి పచ్చజెండా ఊపినట్లయింది. గత మూడురోజుల్లో మొత్తం ఏడు హైకోర్టులకు 36 మంది నూతన న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. 42 న్యాయమూర్తుల పోస్టులు ఉన్న తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం 11 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. ఈ ఏడుగురి నియామకంతో కలిపి మొత్తం సంఖ్య 18కి చేరనుంది. ఇందులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న జస్టిస్‌ జి.శ్రీదేవితో కలిపి అయిదుకు (27.77శాతం) పెరగనుంది. హైకోర్టుకు ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో న్యాయమూర్తులు అందులోనూ మహిళా న్యాయమూర్తుల నియామకం జరగడం ఇదే తొలిసారి. వీరందరు బాధ్యతలు చేపట్టిన తర్వాతా 57శాతం పోస్టులు ఖాళీగానే ఉండనున్నాయి.


నూతన న్యాయమూర్తుల నేపథ్యమిదీ..

మున్నూరి లక్ష్మణ్‌

వ్యవసాయ కుటుంబానికి చెందిన ఎం.అడివయ్య, రుక్కమ్మ దంపతులకు 1965 డిసెంబరు 24న వికారాబాద్‌ జిల్లా వేల్చల్‌ గ్రామంలో జన్మించారు. గ్రామీణ ప్రాంతంలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ సైన్స్‌ కాలేజీలో 1988లో బీఎస్సీలో డిగ్రీ తీసుకున్నారు. 1991లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది బార్‌ కౌన్సిల్‌లో నమోదయ్యారు. హైదరాబాద్‌, రంగారెడ్డి కోర్టులతోపాటు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. జిల్లా జడ్జిగా ఎంపికై మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నాంపల్లిలోని ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టు, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం కార్మిక న్యాయస్థానంలో పనిచేస్తున్నారు.


నూన్‌సావత్‌ తుకారాంజీ

1973 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో జన్మించారు. 1996లో న్యాయవాదిగా నమోదయ్యారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టులతోపాటు పలు ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికై విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలో పనిచేశారు. ప్రస్తుతం నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా పనిచేస్తున్నారు.

 


అద్దుల వెంకటేశ్వరరెడ్డి

వ్యవసాయ కుటుంబానికి చెందిన వెంకటరామరెడ్డి, అనసూయమ్మ దంపతులకు 1961 ఏప్రిల్‌ 15న మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం దేపల్లిలో జన్మించారు. పాఠశాల విద్యను పల్లెలో పూర్తిచేసి 10వ తరగతి నుంచి మహబూబ్‌నగర్‌లో చదువుకున్నారు. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ డిగ్రీ కాలేజీలో పట్టభద్రులయ్యారు. గుల్బర్గాలోని జ్ఞానగంగా యూనివర్సిటీ నుంచి 1986లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది 1987లో బార్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. షాద్‌నగర్‌లో మామ(భార్య తండ్రి) రుక్మారెడ్డి వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 1994 జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై 2005లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2012లో ఎల్‌సీఈ పరీక్షల ద్వారా జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల జడ్జిగా, సీఐడీ సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఉమ్మడి హైకోర్టు చివరి జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌గా, తెలంగాణ మొదటి రిజిస్ట్రార్‌ జనరల్‌, విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ (ఇన్‌ఛార్జి)గా పనిచేశారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు ఆవరణలోని స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని