మిగులుతో వెలుగులు

ప్రధానాంశాలు

మిగులుతో వెలుగులు

తెలంగాణలో అదనంగా 2 మిలియన్‌ యూనిట్లు

ఇంధన ఎక్స్ఛేంజ్‌లో విక్రయం

ఐఈఎక్స్‌లో గరిష్ఠ ధర రూ.20

కొరత ఉన్న రాష్ట్రాల్లో కొనక తప్పని పరిస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: దేశచరిత్రలో ఎన్నడూ లేనిస్థాయిలో విద్యుత్‌ అమ్మకపు ధరలు మండిపోతున్నాయి. ‘భారత ఇంధన ఎక్స్ఛేంజ్‌’(ఐఈఎక్స్‌)లో యూనిట్‌ ధర రూ.6.50 నుంచి 20 వరకూ పలుకుతోంది. గతంలో కొన్నిసార్లు రూ.18కి చేరితేనే డిస్కంలు అల్లాడాయి. ప్రస్తుత సంక్షోభంతో బొగ్గు కొరత ఉన్న రాష్ట్రాల డిస్కంలు ఎంతకైనా కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఇతర రాష్ట్రాలు గరిష్ఠంగా రూ.20కి యూనిట్‌ చొప్పున కొంటుండగా.. తెలంగాణలో మిగులు విద్యుత్‌ ఉండటంతో రోజుకు 2 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) దాకా ఐఈఎక్స్‌లో రాష్ట్రం విక్రయిస్తోంది. బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి సరఫరాలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలు ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలుకు పోటీ పడుతుండటంతో ధర పెరుగుతోంది. 

విద్యుత్‌ అమ్మే సంస్థలు, రాష్ట్రాలు ఇష్టారీతిన ధర పెంచవద్దని కేంద్రం హెచ్చరికలు జారీ చేసినా.. రూ.20 నుంచితగ్గడం లేదు. ఇంత ధర పెట్టి కొనలేక కొన్ని రాష్ట్రాలు కరెంట్‌ కోతలు విధిస్తున్నాయి.

తెలంగాణలో మిగులు ఎందుకంటే..

ఒక రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ ఎంత ఉంటుందో పరిశీలించి దానికన్నా కొంత అదనంగా అందుబాటులో ఉంచుకోవడానికి విద్యుత్కేంద్రాలతో పంపిణీ సంస్థలు(డిస్కంలు) ‘కొనుగోలు ఒప్పందాలను’(పీపీఏలను) కుదుర్చుకుంటాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒకరోజు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ 2021 మార్చి 26న 13,608 మెగావాట్లుగా నమోదైంది. ‘డిమాండ్‌’ అంటే ఒక రోజులో ఏదో ఒక సమయంలో అత్యంత ఎక్కువ వినియోగం. అది కాసేపు లేదా ఆ రోజంతా ఉండవచ్చు. ప్రజలకు నిరంతర సరఫరా కోసం 16,613 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు పలు సంస్థలతో తెలంగాణ డిస్కంలు గతంలో పీపీఏలు చేసుకున్నాయి. రాష్ట్ర డిమాండ్‌ ఏడాదిలో చాలా రోజులు 10 వేల మెగావాట్ల వరకూ ఉండటంతో విద్యుత్‌ మిగులుతోంది. బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్‌ డిమాండు 8 వేల మెగావాట్లుంది. మిగులుగా ఉన్న సుమారు 2 మిలియన్‌ యూనిట్లను ఐఈఎక్స్‌లో సగటున రూ.10 వరకూ అమ్ముతున్నట్లు రాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి.

రోజంతా ఒకే ధర ఉండదు...

ఐఈఎక్స్‌లో అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి అర్ధరాత్రి 12 గంటల వరకూ 24 గంటల సమయాన్ని 15 నిమిషాల చొప్పున విభాగాలుగా చేసి కరెంట్‌ ధరలు నిర్ణయిస్తారు. దేశమంతా సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకూ గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ లక్షా 80 వేల మెగావాట్లు ఉంటుంది. ఆ సమయంలో ఐఈఎక్స్‌లో గరిష్ఠంగా యూనిట్‌ ధర రూ.20 పలుకుతోంది. బుధవారం డిమాండ్‌ లేని సమయంలో రూ.6.50లకు పడిపోయింది. సగటున రూ.10కి పైనే పలుకుతోందని సీనియర్‌ విద్యుత్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఈ ధరకు ఐఈఎక్స్‌లో కొని ప్రజలకు సరఫరా చేస్తే డిస్కంలు ఆర్థికంగా నష్టపోతాయని ఆయన వివరించారు.

ఏపీ డిస్కంలపై పెనుభారం

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కొరత కారణంగా ఎక్స్ఛేంజ్‌లో కొంటోంది. బుధవారం సాయంత్రం 6.45 నుంచి 7 గంటల మధ్య ఏపీ రాష్ట్ర గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 7,280 మెగావాట్లుండగా 8 లక్షల యూనిట్ల కొరత ఉంది. దీంతో ఐఈఎక్స్‌లో  2102 మెగావాట్లను కొన్నట్లు కేంద్ర విద్యుత్‌శాఖ వెల్లడించింది. ఒకవేళ విద్యుత్‌ కొనకపోతే కోతలు విధించాల్సి ఉంటుందని కేంద్ర అధికారులు వివరించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని