ఇంటర్‌ స్థాయిలోనూ ఈడబ్ల్యూఎస్‌ కోటా

ప్రధానాంశాలు

ఇంటర్‌ స్థాయిలోనూ ఈడబ్ల్యూఎస్‌ కోటా

ఆదర్శ పాఠశాలల ఇంటర్‌ ప్రవేశాల్లో వచ్చే ఏడాది నుంచి అమలు

పాలిటెక్నిక్‌, ఈసెట్‌కూ వర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచి ఇంటర్‌ స్థాయి కోర్సులతోపాటు మరిన్ని కోర్సుల్లో ఆర్థికంగా బలహీన వర్గాలు(ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్‌ కోటా అమలు కానుంది. ఈసారి ఎంసెట్‌తోపాటు ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది దాన్ని మరింతగా విస్తరించనుంది. ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌మీడియట్‌లో వచ్చే సంవత్సరం అమలు చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పాలిటెక్నిక్‌, ఈసెట్‌ కౌన్సెలింగ్‌తోపాటు బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ)లో అమలు చేయనుంది. సాధారణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మాత్రం సీట్లు పెంచరని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఒక సెక్షన్‌కు 88 సీట్లు ఉన్నాయని, వాటిల్లో పెంచినా తరగతి గదుల్లో స్థల సమస్య ఉత్పన్నమవుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 24వ తేదీన జీఓ జారీ చేసింది.

ఈసారి ఆర్‌జీయూకేటీలో బీటెక్‌లో సీట్ల కేటాయింపులో...

బాసర ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులుంటాయి. అంటే పదో తరగతి పాసైన వారు రెండేళ్లు ఇంటర్‌, మరో నాలుగేళ్లు బీటెక్‌ చదువుతారు. ప్రభుత్వం జీఓ ఇచ్చే నాటికే వర్సిటీ నోటిఫికేషన్‌ వెలువడటంతో ఈసారి ప్రవేశాల సమయంలో కాకుండా ఇంటర్‌ పూర్తయిన తర్వాత విద్యార్థులకు వారి మార్కులను బట్టి బీటెక్‌లో బ్రాంచీలు కేటాయిస్తారు. ఈ సంవత్సరం ఆ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారు. అందులో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేయాలని వర్సిటీ ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం దస్త్రం ఇన్‌ఛార్జి వీసీ రాహుల్‌ బొజ్జా వద్ద పరిశీలనలో ఉంది.

ఇవీ ప్రయోజనం...

* రాష్ట్రంలో 194 ఆదర్శ పాఠశాలలు ఉండగా అందులో ఆంగ్ల మాధ్యమంలో ఆరు నుంచి ఇంటర్‌ వరకు తరగతులుంటాయి. ఒక్కో దాంట్లో  ఇంటర్‌లో నాలుగు బ్రాంచీలు ఉండగా 160 సీట్లున్నాయి. పది శాతం పెంచితే ఒక్కో దాంట్లో 16 సీట్ల చొప్పున 3,104 సీట్లు పెరుగుతాయి. ఇంటర్‌ చదివే అమ్మాయిలకు హాస్టల్‌ వసతి ఇస్తారు.

* పాలిటెక్నిక్‌లో 1200 సీట్లు పెరగడం వల్ల విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ఇక ఆర్‌జీయూకేటీతోపాటు ఈసెట్‌ కింద బీటెక్‌/ బీఫార్మసీలో లేటరల్‌ ఎంట్రీలో కూడా సీట్లు పెరుగుతాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని