NAT 2021: మీ పిల్లల విద్యా సామర్థ్యం ఎంత?

ప్రధానాంశాలు

NAT 2021: మీ పిల్లల విద్యా సామర్థ్యం ఎంత?

పరీక్షించేలా నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు

ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న ఎన్‌టీఏ

ఈ నెల 23, 24 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: మీ పిల్లల విద్యా సామర్థ్యం ఎంత? ఏయే అంశాలపై వారికి పట్టుంది. వారి విషయ పరిజ్ఞానం ఏమిటి? అనేది తెలుసుకుంటే..భవిష్యత్తులో వాళ్లు ఏ రంగంలో రాణిస్తారో ఇట్టే అంచనా వేయవచ్చు. ఈ లక్ష్యంతోనే జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) ప్రయోగాత్మకంగా ‘‘నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు(న్యాట్‌)-2021’’కు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌లో జరిగే పరీక్ష రాసేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ‘‘భవిష్యత్తు అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థులకు ఉన్నాయో తెలుసుకునేందుకే ఈ పరీక్ష. తదనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేయడానికీ ఇది దోహదం చేస్తుందని నమ్ముతున్నాం. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. పరీక్షలో భాగంగా పలు రకాల నైపుణ్యాలను పరీక్షిస్తాం. గణాంకాలు, అనలిటికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ తదితర మొత్తం తొమ్మిది విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. 15-25 సంవత్సరాల వయసు విద్యార్థులు(8వ తరగతి, ఆపైన) పాల్గొనవచ్చు’ అని ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. విద్యార్థులు సాధించిన మార్కులపై నివేదిక కూడా ఇస్తామని తెలిపాయి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: ‌www.nat.nta.ac.in ను సంప్రదించాలని సూచించారు.

నాలుగు స్థాయులుగా విభజన

విద్యార్థుల వయసును బట్టి నాలుగు స్థాయిలుగా విభజించి పరీక్షలు నిర్వహిస్తారు. స్థాయి-1(13-15), స్థాయి-2(16-18), స్థాయి-3( 19-21), స్థాయి-4లో 22-25 సంవత్సరాల వారు పాల్గొనవచ్చు.

ఇదీ కాలపట్టిక

* రిజిస్ట్రేషన్‌, దరఖాస్తుల సమర్పణ గడువు: 18వ తేదీ వరకు

* పరీక్ష తేదీ: స్థాయి-1, 2 అక్టోబరు 23న; స్థాయి-3,4 24న

* సమయం: 2 గంటలు(ఉదయం 11 నుంచి 1 గంట వరకు, సాయంత్రం: 4-6 గంటల వరకు)


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని