‘కంప్యూటర్‌ సైన్స్‌’కే జై

ప్రధానాంశాలు

‘కంప్యూటర్‌ సైన్స్‌’కే జై

ఆ బ్రాంచీలో సీట్ల పెంపునకు కళాశాలల పోటీ

గిరాకీని సొమ్ము చేసుకునేందుకే

రెండేళ్లలో ఇంజినీరింగ్‌లో మిగిలిన బ్రాంచీల కనుమరుగు!

ఈనాడు - హైదరాబాద్‌

కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలు.. ఒకటీ రెండు సంవత్సరాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలలను ఇలాగే పిలవాల్సి రావచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌, సంబంధిత బ్రాంచీలు తప్ప మిగిలినవి దాదాపు కనుమరుగు అవుతుండటమే కారణం. ఈ ఏడాది తొలి విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కన్వీనర్‌ కోటాలో 74,071 సీట్లకు గాను సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లోనే 38,796 (52 శాతం) సీట్లు ఉన్నాయి. పలు కళాశాలల్లో కంప్యూటర్‌ సంబంధిత బ్రాంచీలతో పాటు ఈసీఈ మాత్రమే ఉండటం గమనార్హం. సాఫ్ట్‌వేర్‌ రంగంలో డిమాండ్‌ ఉన్న బ్రాంచీల్లో సీట్లను కళాశాలల యాజమాన్యాలు భారీగా పెంచుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. ఈసారి అత్యంత నాసిరకం కళాశాలల్లోనూ సీఎస్‌ఈ సీట్లు నిండాయి. వాటిలోనూ యాజమాన్య సీట్లు కనీసం రూ.2 లక్షలు పలికినట్లు తెలుస్తోంది.

మిగిలేది 20 కళాశాలల్లోనే.

ఏఐసీటీఈ 2019లో కొత్త బ్రాంచీలకు పచ్చజెండా ఊపింది. అప్పటినుంచి కళాశాలలు సీఎస్‌ఈ, ఇతర కొత్త బ్రాంచీల్లో పెద్దసంఖ్యలో సీట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. కోర్‌ బ్రాంచీల్లో కనీసం ఒక సెక్షన్‌ ఉండాలని జేఎన్‌టీయూహెచ్‌ నిబంధన విధించినా ఫలితం ఉండటం లేదు. వచ్చే రెండేళ్లలో డిమాండ్‌ లేని బ్రాంచీలను రద్దు చేసుకొని.. కృత్రిమ మేధ, డేటా సైన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) తదితరాల్లో సీట్లు పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా 15-20 కళాశాలల్లోనే మెకానికల్‌, సివిల్‌, ఈఈఈ తదితర కోర్‌ బ్రాంచీలు ఉండే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మేజర్‌, మైనర్‌ డిగ్రీలు

కొత్త బ్రాంచీలను అడ్డుకునే పరిస్థితి లేదని భావిస్తున్న జేఎన్‌టీయూహెచ్‌ మేజర్‌, మైనర్‌ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెడుతోంది. బీటెక్‌లో ఏ బ్రాంచీ విద్యార్థి అయినా 20 క్రెడిట్లకు కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ తదితర కోర్సులను ఎంచుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు. ‘కోర్‌ బ్రాంచీలు చదివినా ఐటీ కంపెనీల్లోనే చేరాల్సి వస్తోంది. కోర్‌ బ్రాంచీల్లో కొలువులుంటే వాటినే విద్యార్థులు చదువుతారు’ అని కంప్యూటర్‌ సైన్స్‌ ఆచార్యుడు కామాక్షిప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

కొన్ని కళాశాలల్లో ఇదీ పరిస్థితి..

హైదరాబాద్‌లోని స్ఫూర్తి, సెయింట్‌ మేరీ కళాశాలల్లో ఒక్క కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత బ్రాంచీలు తప్ప మిగిలిన ఏ బ్రాంచీ లేదు. సీఎంఆర్‌ టెక్నికల్‌ క్యాంపస్‌, సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ బ్రాంచీలు, సీఎంఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మల్లారెడ్డి మహిళా కళాశాలలో సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచీలే ఉన్నాయి. గతంలో మూతబడిన ఒక కళాశాలను ఈసారి ఒక్క సీఎస్‌ఈ బ్రాంచీతోనే తెరవడం గమనార్హం.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని