చార్మినార్‌ వద్ద ‘ప్రత్యేక సందడి’

ప్రధానాంశాలు

చార్మినార్‌ వద్ద ‘ప్రత్యేక సందడి’

వచ్చే ఆదివారమే ప్రారంభం

‘ఏక్‌ శామ్‌ చార్మినార్‌కే నామ్‌’ పేరుతో నెలలో రెండు సార్లు నిర్వహించే యోచన

చార్మినార్‌, న్యూస్‌టుడే: ట్యాంక్‌బండ్‌ తరహాలో చార్మినార్‌ వద్ద కూడా ఆదివారం సాయంత్రాలు నగరవాసులు ఆనందంగా విహరించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ‘ఏక్‌ శామ్‌ చార్మినార్‌కే నామ్‌’ పేరుతో నెలలో కనీసం రెండు ఆదివారాలు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కొత్త సందడిని ఈ నెల 17వ తేదీనే ప్రారంభిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ సూచనతో రంగంలోకి దిగిన రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌.. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలా, కార్పొరేటర్‌ సోహెల్‌ఖాద్రీలతో కలిసి గురువారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ముషాయిరాతో పాటు చిన్నారులకు డ్రాయింగ్‌ తదితర పోటీలూ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్ని ఆకట్టుకునేలా వారాంతాల్లో చార్మినార్‌ వద్ద ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయమని అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. చార్మినార్‌ పరిసరాల్లోని సర్దార్‌ మహల్‌, ఓల్డ్‌ బస్‌స్టేషన్‌, ఖిల్వత్‌ గ్రౌండ్‌, ఖజానా అమేర పెన్షన్‌ పేమెంట్‌ పాత కార్యాలయం ప్రాంతాలను వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని