శాంతిచర్చల వేదిక భాగ్యనగరి

ప్రధానాంశాలు

శాంతిచర్చల వేదిక భాగ్యనగరి

మంజీరా అతిథి గృహంలో మూడు రోజులు ఆర్కే బస

మావోయిస్టు పార్టీ పేరు ప్రకటనా ఇక్కడే

ఈనాడు, హైదరాబాద్‌: సరిగ్గా 17 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నక్సలైట్లను తొలిసారిగా శాంతిచర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చలకు హైదరాబాద్‌లోని మంజీరా అతిథి గృహం వేదికయింది. 2004 అక్టోబరు 15 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజులు ప్రభుత్వ ప్రతినిధులు, మావోయిస్టు ప్రతినిధులు చర్చలు జరిపారు. పీపుల్స్‌వార్‌ ఆంధ్రా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఆర్కే ఈ చర్చల్లో పాల్గొన్నారు. పీపుల్స్‌వార్‌, జనశక్తిలను విలీనం చేస్తూ మావోయిస్టు పార్టీగా ఇక్కడే ప్రకటన చేశారు. ఆర్కే, అమర్‌ వంటి అగ్రనేతలు మూడు రోజులు మంజీరా అతిథి గృహంలోనే బస చేశారు.

అప్పట్లోనే తెలంగాణకు రాష్ట్ర హోదా డిమాండ్‌

శాంతి చర్చలకు వచ్చిన మావోయిస్టు ప్రతినిధులు ప్రధానంగా ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. తమ షరతులకు అంగీకరిస్తేనే శాంతిమార్గంలో పయనిస్తామని స్పష్టం చేశారు. 11 అంశాల ఎజెండాను రూపొందించారు. అప్పట్లోనే తెలంగాణా ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 25 లక్షల ఎకరాలను భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని, ప్రపంచ బ్యాంకు విధానాలను గుడ్డిగా అమలు చేయకుండా, నిలిపివేయాలంటూ ఆర్కే సహా మావోయిస్టు అగ్రనేతలు కోరారు. ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేసేందుకు ప్యాకేజీ, మద్య నిషేధం అమలు చేయాలంటూ తమ వైఖరిని ప్రభుత్వానికి చాటిచెప్పారు.

పాత్రికేయులతో ఆప్యాయంగా...

చర్చల్లో భాగంగా ఇతర మావోయిస్టు అగ్రనేతలతో కలిసి ఆర్కే అక్టోబరు, 14వ తేదీ రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అదేరోజు రాత్రి పలువురు పాత్రికేయులతో మాట్లాడారు. అప్పటి నుంచి చర్చలు ముగిసి తిరిగి అడవుల్లోకి వెళ్లేంత వరకూ ఆర్కే పాత్రికేయులతో ఆప్యాయంగా మాట్లాడారు. వరంగల్‌తోపాటు హైదరాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధముందని, పలు ప్రాంతాలు తనకు చిరపరిచితమంటూ అనుభవాలను పంచుకున్నారు. కామ్రేడ్‌ అన్న పదం ఎంతో బాధ్యతాయుతమైందని, సమ సమాజం కోసం తాము పరితపిస్తున్నామని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని