కల్యాణలక్ష్మిలో చేతివాటం

ప్రధానాంశాలు

కల్యాణలక్ష్మిలో చేతివాటం

ఆర్థిక సాయం మంజూరుకు చేతులు తడపాల్సిందే..

కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అక్రమాలు

రాష్ట్రవ్యాప్తంగా 43 మందిని గుర్తించిన విజిలెన్స్‌ విభాగం

శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: పేదింట ఆడపిల్ల పెళ్లి ఉంటే పది మంది తలా ఓ చేయి వేసి తోచిన విధంగా సహాయం చేస్తారు. ప్రభుత్వం సైతం పేద ఆడపిల్లల వివాహానికి అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టింది. అర్హులకు రూ.1,00,116 చొప్పున అందజేస్తోంది. ఆ ఆర్థిక సాయంలో కొందరు రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ మధ్యవర్తులతో కలిసి దొరికినంత దోచుకుంటున్నారు. దరఖాస్తుల పరిశీలన, చెక్కుల పంపిణీ పేరిట ఒక్కొక్కరి నుంచి వేలల్లో వసూలు చేసినట్లు విజిలెన్స్‌ విభాగం పరిశీలనలో వెల్లడైంది. రాష్ట్రంలోని వరంగల్‌, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అక్రమాలు వెలుగుచూశాయి. కొన్నిచోట్ల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు నేరుగా రూ.1000 నుంచి రూ.10 వేల వరకు లంచాలు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మీసేవా కేంద్రాల నిర్వాహకులు మధ్యవర్తులుగా అవతారమెత్తారని, రెవెన్యూ అధికారులు వీరితో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి విజిలెన్స్‌ విభాగం నివేదిక ఇచ్చింది. అక్రమాలకు పాల్పడిన 43 మంది రెవెన్యూ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేసింది. ఆదిలాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలోని ఓ ఉద్యోగి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వెల్లడైంది. ఆయనతో పాటు 9మంది మధ్యవర్తులపై గుడిహత్నూర్‌ పోలీస్‌స్టేషన్లో కేసు సైతం నమోదైంది. విజిలెన్స్‌ నివేదికలో పేర్కొన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.


వసూళ్లు ఇలా..

* వరంగల్‌ అర్బన్‌(హనుమకొండ) జిల్లాలో ధర్మసాగర్‌, వీలేరు మండలాల పరిధిలో దరఖాస్తు సమయంలో రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. స్థానిక జడ్పీటీసీ మాజీ సభ్యుడు, ఇద్దరు మాజీ ఎంపీపీలు, ఒక సర్పంచి, మరో వ్యక్తి మధ్యవర్తులుగా వ్యవహరించారు.

* జనగామ జిల్లాలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగోపుల, జఫర్‌గఢ్‌, పాలకుర్తి మండలాల పరిధిలో దరఖాస్తుల పరిశీలన సమయంలో అధికారులు నేరుగా రూ.2-3 వేల వరకు తీసుకున్నట్లు వెల్లడైంది.

* భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి, గణపురం మండలాల పరిధిలో దరఖాస్తుల పరిష్కారానికి సిబ్బంది రూ.5-10 వేలు తీసుకున్నట్లు విజిలెన్స్‌ కమిటీ గుర్తించింది. మీసేవా కేంద్రాల నిర్వాహకులు మధ్యవర్తులుగా వ్యవహరించారని పేర్కొంది.

* మహబూబాబాద్‌ జిల్లాలో గూడూరు, కేసముద్రం, మహబూబాబాద్‌ మండలాల్లో రూ.5-10 వేల వరకు వసూలు చేశారు. ఇద్దరు వీఆర్‌వోలు, స్థానిక తెరాస నాయకులు, ఎంపీపీలు, కార్యాలయ ఉద్యోగి, సర్పంచులు మధ్యవర్తులుగా ఉన్నారని తెలిపింది.

* నల్గొండ జిల్లాలోని నిడమనూరు, తిరుమలగిరి సాగర్‌, దామరచర్ల, మిర్యాలగూడ పట్టణం, గ్రామీణం, వేములపల్లి, నకిరేకల్‌, కేతేపల్లి మండలాల పరిధిలో ఒక్కో దరఖాస్తు పరిష్కారానికి రూ.3 వేల నుంచి రూ.5 వేలు తీసుకున్నారని విజిలెన్స్‌ నివేదిక వెల్లడించింది. ఒక పంచాయతీ కార్యదర్శి, సహాయ స్టాటిస్టికల్‌ అధికారి, ఇద్దరు ఆర్‌ఐలు, ఒక సహాయ ఆర్‌ఐతో పాటు పలువురు దళారులుగా వ్యవహరించారని తెలిపింది.

* నిజామాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌ దక్షిణ, నిజామాబాద్‌ ఉత్తర తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేశారు. నలుగురు ఎంఐఎం, ఇద్దరు తెరాస కార్యకర్తలతోపాటు మీసేవా కేంద్రాల వారు మధ్యవర్తులుగా వ్యవహరించారు.Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని