కేంద్రం వైపు.. కృష్ణా బోర్డు చూపు

ప్రధానాంశాలు

కేంద్రం వైపు.. కృష్ణా బోర్డు చూపు

వచ్చే వారంలో కేంద్ర జల్‌శక్తి అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌!

ఈనాడు హైదరాబాద్‌: ఒక రాష్ట్రం ప్రాజెక్టులను స్వాధీనం చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది, కానీ,, నిబంధన పెట్టింది. ఇంకో రాష్ట్రం నుంచి సమాచారం లేదు. దీంతో తదుపరి కార్యాచరణ ఏంటన్నదానిపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. వచ్చే వారంలో జల్‌శక్తి అధికారులు కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం అక్టోబరు 14 నుంచి రెండో షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులు బోర్డుల నిర్వహణలోకి రావాల్సి ఉంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో బోర్డు అధికారులు సంప్రదింపులు నిర్వహించారు. కనీసం ఉమ్మడి ప్రాజెక్టులనైనా మొదటి దశలో అప్పగించేలా ఒప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి.

ఏపీ షరతుతో...

గోదావరిలో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఒక్కటే. రెండు రాష్ట్రాలకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో  సమస్యలేకుండా పోయింది. కృష్ణాలో ఇందుకు పూర్తి భిన్నం. శ్రీశైలం హెడ్‌వర్క్స్‌, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా మొదటి పంపుహౌస్‌, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలతోపాటు సిబ్బంది, కార్యాలయాలను బోర్డుకు అప్పగిస్తూ ఈనెల 14న ఏపీ ఉత్తర్వులిచ్చింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్తు కేంద్రం, సాగర్‌ కుడికాలువ విద్యుత్తు కేంద్రాన్ని అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఇంధనశాఖ ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ రెంటిలోనూ ‘తెలంగాణ అప్పగిస్తేనే’ అనే షరతు పెట్టింది. కాబట్టి ఉత్తర్వులిచ్చినా ఆయా ప్రాజెక్టుల ఇంజినీర్లు చేయడానికి ఏమీలేదు. తెలంగాణ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. కల్వకుర్తి, సాగర్‌ హెడ్‌వర్క్స్‌, కుడి, ఎడమ కాలువల రెగ్యులేటర్లు, ఎ.ఎం.ఆర్‌.పి. మొదటి లిఫ్టు బోర్డుకు అప్పగించడంపై ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌.. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. మరోవంక.. బోర్డులో నియమించిన కేంద్ర జల సంఘం అధికారులు ప్రాజెక్టుల వారీ పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు తెలిసింది. చేపట్టిన పనులు, చెల్లించాల్సిన బిల్లులు, రుణాలు, సిబ్బంది ఆ ప్రాజెక్టులోనే పని చేస్తున్నారా లేక వేరేచోట చేస్తూ ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారా ఇలా అన్ని వివరాలు సిద్ధం చేసుకొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బోర్డులో పనిచేసే సిబ్బంది సంఖ్య పెరిగింది. జీతాలు, భత్యాలు ఇలా అన్నీ కలిపి ఒక్కో బోర్డుకు కనీసం నెలకు రూ.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. కానీ కృష్ణా బోర్డు వద్ద సుమారు రూ.కోటి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.


కేఆర్‌ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, సాగర్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు: ఏపీ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: ఏజీ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం కుడి కాలువ గట్టు, నాగార్జునసాగర్‌ కుడికాలువ జలవిద్యుత్‌ ప్రాజెక్టుల పర్యవేక్షణను కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించటానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ‘జలవనరుల శాఖ, తెలంగాణ జెన్‌కోతో సంప్రదింపులు జరిపి.. రికార్డులను అప్పగించటంలో వారు వ్యవహరించే తీరుకు అనుగుణంగా వ్యవహరించాలి. ఈ ఉత్తర్వుల ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ సిబ్బంది కలిపి 357 మంది, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో పనిచేసే 63 మంది సిబ్బందిని అప్పగించాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని