కొత్తగూడెం ప్లాంటుకూ కోత!

ప్రధానాంశాలు

కొత్తగూడెం ప్లాంటుకూ కోత!

సరఫరా తగ్గించాలని కేంద్రం ఆదేశం
5 రోజులకు సరిపడా నిల్వలుంటే సరిపోతుందని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరా పెద్దగా మెరుగుపడకపోవడంతో కేంద్రం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని విద్యుత్కేంద్రానికి ప్రస్తుతం సరఫరా చేస్తున్న బొగ్గును కొంతమేర తగ్గించాలని సింగరేణి సంస్థను తాజాగా ఆదేశించింది. బొగ్గు గనులకు ఈ కేంద్రం చేరువగా ఉన్నందున కేవలం 5 రోజులకు సరిపడా నిల్వలు ఉండేలా చూస్తే సరిపోతుందని స్పష్టంచేసింది. కేంద్రం మౌఖిక ఆదేశాలతో ఇకనుంచి రోజూ ఒక గూడ్సురైలు లోడు సరఫరా తగ్గించాలని సింగరేణి నిర్ణయించింది. భూపాలపల్లిలోని విద్యుత్కేంద్రానికి కేంద్రం బొగ్గు సరఫరా తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్తగూడెం కేంద్రానికీ తగ్గించాలనడంతో తెలంగాణలోని రెండు విద్యుత్కేంద్రాల్లోనూ నిల్వలు తగ్గనున్నాయి. రెండు ప్లాంట్లకు కలిపి రోజుకు 22,700 టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం లక్షా 26 వేల టన్నులుంది. 5 రోజులకు సరిపోయేలా లక్షా 15 వేల టన్నులుంటే చాలని, ఈ పరిమితి వచ్చేదాకా సరఫరాలో కోత పెట్టాలని కేంద్రం తెలిపింది.

17 కేంద్రాల్లో నిండుకున్న బొగ్గు నిల్వలు

దేశంలోని పలు విద్యుత్కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నెల 13 నాటికి మొత్తం 135 విద్యుత్కేంద్రాలకు గాను 112 కేంద్రాల్లో తీవ్ర కొరత ఉంది. 17 కేంద్రాల్లో అసలు బొగ్గే లేదు. వీటి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 17,050 మెగావాట్లు. అంటే ఏపీ, తెలంగాణల్లో దాదాపు ఒకరోజు వాడేంత కరెంటుతో సమానం. మరో 27 కేంద్రాల్లో ఒక రోజుకు, ఇంకో 20 కేంద్రాల్లో 2 రోజులకు సరిపోయేంత నిల్వలే ఉన్నాయి. ఈ 64 కేంద్రాల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 75,365 మెగావాట్లు. దేశంలో మొత్తం బొగ్గు ఆధారిత థర్మల్కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2.02 లక్షల మెగావాట్లు కాగా.. అందులో 75,365 మెగావాట్ల కేంద్రాలకు బొగ్గే లేదని తేలింది. ఈ నేపథ్యంలో గనులకు దగ్గరగా ఉన్న విద్యుత్కేంద్రాల్లో 5, దూరంగా ఉన్నవాటిలో 7 రోజులకు సరిపోయినంత నిల్వలుంటే చాలని, అంతకన్నా ఎక్కువగా ఎక్కడైనా ఉంటే.. కొరత ఉన్న ప్రాంతాలకు తరలించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందువల్లనే భూపాలపల్లి, కొత్తగూడెం ప్లాంట్లకు సరఫరాలో కోత పెట్టినట్లు సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. సింగరేణి గనులకు దగ్గరగా ఉన్నందున తెలంగాణ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు లేక విద్యుదుత్పత్తి ఆపే అవకాశాలుండవని.. తీవ్ర కొరత ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు సరఫరాలో ప్రాధాన్యమివ్వాలని కేంద్రం చెప్పిందని ఆయన వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని