విధుల్లేని విభాగం.. నిధులేమో వినియోగం

ప్రధానాంశాలు

విధుల్లేని విభాగం.. నిధులేమో వినియోగం

మూడున్నరేళ్లుగా పని లేని వయోజన విద్య సిబ్బంది
2018 మార్చితో ముగిసిన సాక్షర భారత్‌
ఆ తర్వాత మరో కార్యక్రమం లేదు
వేతనాలు, ఖర్చులకు ఏటా రూ.7 కోట్లు వ్యయం
మొదలుకాని పఢ్‌నా లిఖ్‌నా అభియాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: వయోజన విద్య విభాగానికి గత మూడున్నర సంవత్సరాలుగా పనిలేకుండా పోయింది. ఆ విభాగం చేపట్టిన ఏకైక కార్యక్రమం సాక్షర భారత్‌ పథకం 2018 మార్చితో ముగిసింది. ఆ తర్వాత మరో పథకాన్ని చేపట్టలేదు. ఫలితంగా రాష్ట్ర కార్యాలయం, జిల్లాల్లోని 51 మంది సిబ్బంది మూడున్నర సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నారు. వారి వేతనాలు, కార్యాలయ ఖర్చుల కోసం మాత్రం ఏటా రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వ్యయమవుతోంది. ప్రభుత్వం సైతం రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచే దిశగా అవసరమైన కార్యాచరణను అప్పగించకపోవడంతో వారు రోజూ కార్యాలయాలకు వచ్చి వెళుతున్నారు.

సిబ్బంది వస్తున్నారు...వెళ్తున్నారు

సాక్షర భారత్‌ స్థానంలో కేంద్రం 2019-20 సంవత్సరంలో పఢ్‌నా లిఖ్‌నా అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. అయితే కేంద్రం కూడా మార్గదర్శకాలు ఇవ్వకుండా జాప్యం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 2019 సెప్టెంబరు 8వ తేదీన పిల్లలే తమ కుటుంబంలోని పెద్దలను అక్షరాస్యులుగా చేసేలా ‘ఈచ్‌ వన్‌...టీచ్‌ వన్‌’ పేరిట ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు. అంటే సాక్షర భారత్‌ ముగిసిన తర్వాత ఏడాదిన్నరకు అది మొదలైంది. అదీ తూతూమంత్రంగానే సాగిందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం మాత్రం 44,972 మందిని అక్షరాస్యులను చేశారని లెక్కలు చూపిస్తోంది. ఆ కార్యక్రమం ప్రారంభమైన ఆరు నెలలకే 2020 మార్చిలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. అప్పటి నుంచి గత ఏడాదిన్నరగా ఆ విభాగానికి పని లేకుండా పోయింది. అంటే 2018 మార్చి తర్వాత పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా మూడు నాలుగు నెలలు మాత్రమే కొంతవరకు చేతికి పనిదొరికింది. అధికారులు అక్షర తెలంగాణ పేరిట వాచకం రూపొందించారు. అప్పుడు కూడా నిరక్షరాస్యుల సర్వేలో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖ సిబ్బందే చేపట్టారు. ఈ విభాగంలో మొత్తం మంజూరు పోస్టులు 228. ప్రస్తుతం 51 మందే పనిచేస్తున్నారు. వారికీ చేయడానికి పనిలేదు. అందులో ఎనిమిది మందే హైదరాబాద్‌ రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తుండగా...మిగిలిన వారు ఆయా జిల్లాల్లో డిప్యూటీ డైరెక్టర్లు, సూపర్‌వైజర్లు తదితరులున్నారు. వారికి ఏడాదికి వేతనాలతోపాటు కార్యాలయ ఖర్చుల కోసం రూ.7 కోట్ల వరకు నిధులు ఖర్చవుతున్నాయి. సిబ్బంది రోజూ కార్యాలయాలకు వస్తున్నారు...వెళుతున్నారు.‘ మూడేళ్లుగా పనిలేకుండా జీతాలు తీసుకుంటున్నాం...చిన్నతనంగా ఉంటోంది’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

అక్షరాస్యతలో వెనుకబడిఉన్నా

2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15 సంవత్సరాల వయసుపైబడిన 99.73 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 66.54 శాతమే. అంటే దేశ సగటు(73 శాతం) కంటే తక్కువ. ఈ విషయంలో కింద నుంచి రాష్ట్రానికి అయిదో స్థానం. రెండేళ్ల క్రితం నిర్వహించిన జాతీయ నమూనా సర్వేలో దేశ అక్షరాస్యత సగటు 76 శాతంగా నమోదవ్వగా రాష్ట్ర సగటు 72.80 శాతానికి చేరుకుంది.

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయిందని బడులు ప్రారంభించిన ప్రభుత్వం వయోజనులను అక్షరాస్యులుగా చేసే కొత్త పథకం పఢ్‌నా లిఖ్‌నా అభియాన్‌ను మాత్రం ప్రారంభించడం లేదు. ఈ పథకాన్ని ఖమ్మం, ఆసిఫాబాద్‌, భూపాలపల్లిలో అమలుకు 2021-22 బడ్జెట్‌లో రూ.6.50 కోట్లు ప్రతిపాదించారు. దీనిపై వయోజన విద్య శాఖ సంచాలకురాలు విజయలక్ష్మి బాయిని వివరణ కోరగా పథకం కోసం ఖాతా తెరుచుకోవడానికి ఇటీవలే అనుమతి వచ్చిందని, పథకం ప్రారంభించే తేదీని ఇంకా ప్రభుత్వం ఖరారు చేయలేదన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని