Hypersonic missile: రహస్యంగా భూమిని చుట్టేసిన చైనా క్షిపణి

ప్రధానాంశాలు

Hypersonic missile: రహస్యంగా భూమిని చుట్టేసిన చైనా క్షిపణి

గురితప్పినా.. సత్తా చాటిన హైపర్‌సోనిక్‌ అస్త్రం  
కంగుతిన్న అమెరికా

బీజింగ్‌: చైనా మరోసారి దూకుడు ప్రదర్శించింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఒక సరికొత్త హైపర్‌సోనిక్‌ క్షిపణిని పరీక్షించింది. అది.. దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ పుడమి మొత్తాన్ని చుట్టేసింది. ఆ తర్వాత కిందకి దిగి, శరవేగంగా లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఇది కొద్దిలో గురితప్పినా.. ప్రమాదకరమైన క్షిపణి రూపకల్పనలో డ్రాగన్‌ చాలావరకూ పట్టు సాధించినట్లు తేటతెల్లమైంది. ఈ రంగంలో చైనా పురోగతి అమెరికా నిఘా వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమ అంచనాలను మించి డ్రాగన్‌ ముందడుగు వేసినట్లు తెలుసుకొని నివ్వెరపోయాయి.

ఈ పరీక్ష ఆగస్టులోనే జరిగింది. చైనా దీన్ని అత్యంత గోప్యంగా ఉంచింది. ఈ పరీక్ష గురించి పూర్తి అవగాహన ఉన్న అధికారులను ఉటంకిస్తూ పాశ్చాత్య మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. పరీక్షలో చైనా ప్రయోగించిన అస్త్రం.. నిర్దేశిత లక్ష్యానికి 32 కిలోమీటర్ల దూరంలో పడింది. అయినా ఇది పెద్ద పురోగతే. చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇది జరగడం గమనార్హం.

ఏమిటీ ఆయుధం?
ధ్వనితో పోలిస్తే కనీసం ఐదు రెట్లు వేగం (గంటకు 6,200 కిలోమీటర్లు)గా దూసుకెళ్లే అస్త్రాలను హైపర్‌సోనిక్‌ క్షిపణులుగా పేర్కొంటారు. రాకెట్‌ సాయంతో వీటిని ప్రయోగిస్తారు.

* సాధారణ బాలిస్టిక్‌ క్షిపణులు నింగిలోకి లేచి.. అంతరిక్షంలోకి దూసుకెళ్లి, తిరిగి భూమి దిశగా దూసుకొస్తాయి. తమకు నిర్దేశించిన లక్ష్యంపై పడతాయి. ఆర్చి ఆకారంలో వీటి పయనం సాగుతుంది.

* హైపర్‌సోనిక్‌ అస్త్రం మాత్రం తక్కువ ఎత్తుకే (భూ దిగువ కక్ష్యకు) చేరుకుంటుంది. ఆ తర్వాత ఎలాంటి శక్తి అవసరం లేకుండానే వేల కిలోమీటర్ల పాటు గ్లైడర్‌లా పయనిస్తూ నిర్దేశించిన లక్ష్యంపైకి దూసుకెళుతుంది. దీన్ని ‘హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ వెహికిల్‌’ అంటారు. ఇవి చాలా వేగంగా లక్ష్యంపై విరుచుకుపడగలవు. వీటిలో క్రూజ్‌ క్షిపణులూ ఉంటాయి. అవి తమ యాత్ర మొత్తం స్వీయ ఇంజిన్‌ సాయంతోనే పయనిస్తాయి.

* బాలిస్టిక్‌ క్షిపణులకు భిన్నంగా హైపర్‌సోనిక్‌ అస్త్రాలను మార్గమధ్యంలో నియంత్రించే వీలుంది. కోరుకున్న రీతిలో వాటిని పయనించేలా చేయవచ్చు. అందువల్ల నిర్దిష్ట మార్గంలో అవి ప్రయాణించవు. వాటి గమనాన్ని పసిగట్టడం, వాటి నుంచి రక్షణ పొందడం చాలా కష్టం. బాలిస్టిక్‌ క్షిపణుల తరహాలో ఇవి కూడా అణ్వస్త్రాలను మోసుకెళ్లగలవు.

క్షిపణి రక్షణ వ్యవస్థ తుస్‌..
అమెరికా వంటి దేశాలు బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణుల నుంచి రక్షణ పొందడానికి ‘మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ’ను అభివృద్ధి చేశాయి. అయితే మెరుపు వేగంతో దూసుకొచ్చే హైపర్‌సోనిక్‌ అస్త్రాలపై వీటి సమర్థత ప్రశ్నార్థకమే. చైనా హైపర్‌సోనిక్‌ ఆయుధానికి దక్షిణ ధ్రువంపై నుంచి పయనించే సత్తా ఉంది. ఇది అమెరికా సైన్యానికి ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే ఆ దేశ క్షిపణి రక్షణ వ్యవస్థలు ప్రధానంగా ఉత్తర ధ్రువ మార్గంపై దృష్టిసారిస్తున్నాయి.


ఏయే దేశాల వద్ద?

ష్యా, చైనా, అమెరికా, ఉత్తర కొరియాలు హైపర్‌సోనిక్‌ క్షిపణులను పరీక్షించాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌లు కూడా దీనిపై కసరత్తు చేస్తున్నాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియాలు ప్రాథమిక పరిశోధన చేశాయి.

*  రష్యా అభివృద్ధి చేసిన అవన్‌గార్డ్‌ క్షిపణి.. ధ్వని కన్నా ఏకంగా 27 రెట్లు వేగంగా దూసుకెళ్లగలదు.


4-5 ఏళ్లలో భారత్‌ సిద్ధం..

హైపర్‌సోనిక్‌ అస్త్రాలపై భారత్‌ దృష్టి పెట్టింది. 4-5 ఏళ్లలో పూర్తిస్థాయి హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్‌ క్రూజ్‌ క్షిపణి కన్నా రెట్టింపు వేగంతో ఇది దూసుకెళ్లగలదు. గత ఏడాది సెప్టెంబరు 7న ప్రయోగాత్మకంగా హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డిమోన్‌స్ట్రేటర్‌ వెహికల్‌ (హెచ్‌ఎస్‌టీడీవీ)ని భారత్‌ పరీక్షించింది. దీని ద్వారా ఈ రంగానికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాలను పరిశీలించింది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని