కబ్జా కోరల్లో వక్ఫ్‌ ఆస్తులు

ప్రధానాంశాలు

కబ్జా కోరల్లో వక్ఫ్‌ ఆస్తులు

దాదాపు 57,423 ఎకరాల పరాధీనం
వేలాది ఎకరాల రికార్డులు మాయం
కొన్నిచోట్ల క్షేత్రస్థాయి సర్వేకు అడ్డంకులు
989 ఆస్తుల ఆక్రమణదారులకు వక్ఫ్‌బోర్డు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వేలాది ఎకరాల వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆస్తులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం.. ఏళ్లుగా ఆక్రమణకు గురవుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో క్షేత్రస్థాయిలో వాటి ఉనికే కష్టమవుతోంది. ఆక్రమణలో ఉన్న అత్యంత విలువైన దాదాపు 2వేల ఆస్తులకు రికార్డులు మాయమయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 33,929 దర్గాలు, మసీదులు, ఆషూర్‌ఖానా, చిల్లా, టకియా, శ్మశానాలు, ఇతర సంస్థల పరిధిలో 77,538 ఎకరాల భూములు ఉండగా.. దాదాపు 57,423 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. వాటిలో కొన్నింటికి న్యాయపరమైన వివాదాలు తలెత్తడంతోపాటు క్షేత్రస్థాయి సర్వే, స్వాధీనం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రెండు చోట్ల... 1132 ఎకరాల వివాదం
అధికారులు గతంలో దాదాపు 2,186 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీచేశారు. నోటీసులను పట్టించుకోకపోవడం, కొందరు న్యాయవివాదాలను సృష్టించడంతో చర్యలు తీసుకోలేకోయారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆ కేసుల పరిష్కారానికి ప్రయత్నించగా.. క్షేత్రస్థాయిలో భూముల రికార్డులు లేక వాటిని సర్వేలో గుర్తించడం కష్టమైంది. కొన్ని కాగితాలు శిథిలం కావడం, మరికొన్నింటిని రికార్డుల నుంచి తొలగించినట్టు ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో రెండు ప్రాంతాల్లో అత్యంత విలువైన దాదాపు 1,132 ఎకరాల భూములు న్యాయవివాదాల్లో ఉన్నాయి.

టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు
హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో 989 ఆస్తుల ఆక్రమణదారులకు వక్ఫ్‌బోర్డు నోటీసులు జారీ చేసింది. ఆ భూములను సర్వే చేసి ఖాళీ చేయించేందుకు రెవెన్యూ, పోలీసు, వక్ఫ్‌బోర్డు అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆక్రమణలను తొలగించేందుకు దాదాపు నాలుగు నెలలు పట్టే అవకాశముందని అంచనా వేస్తోంది.

కీలక ప్రాంతాల్లో చర్యలకు ఇబ్బందులు
హైదరాబాద్‌ నగరంలో ఖైరతాబాద్‌, సైదాబాద్‌, నాంపల్లి, బహదూర్‌పుర, గుట్టల బేగంపేట, నెక్నాంపూర్‌, మేడ్చల్‌, మౌలాలి, మల్కాజిగిరి, ఘట్‌కేసర్‌, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల్లో వక్ఫ్‌ బోర్డుకు విలువైన భూములు ఉన్నాయి. వీటిని ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఆక్రమణల తొలగింపు చేపట్టడం లేదు. ఇటీవల వక్ఫ్‌ ఆస్తులపై తీవ్ర ఆందోళన జరగడంతో 22 ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి 31.01 ఎకరాలను వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకుంది. అయితే హైదరాబాద్‌లో కొన్ని కీలకమైన ప్రాంతాల్లోని వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకోవడం, ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంలో వక్ఫ్‌ బోర్డు అధికారులకు ఇబ్బందులు వస్తున్నాయి.


శ్మశానాలూ వదల్లేదు..

కొన్నిచోట్ల శ్మశాన వాటికలనూ ఆక్రమణదారులు వదిలిపెట్టలేదు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో శ్మశాన వాటికల స్థలాల్లో పక్కా భవనాలు వెలిశాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 1,651 శ్మశాన వాటికలు ఉండగా.. వీటిలో 138 ఆక్రమణల చెరలో ఉన్నాయి. అయితే కేవలం 10 ఆక్రమణలపై మాత్రమే ఇటీవల వక్ఫ్‌బోర్డు స్థానిక పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టింది. మిగతాచోట్ల స్థానిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని