జిన్నింగ్‌ మిల్లులపై సీసీఐ కొరడా

ప్రధానాంశాలు

జిన్నింగ్‌ మిల్లులపై సీసీఐ కొరడా

పత్తిలో చెత్త పేరిట రూ.5 కోట్ల జరిమానా

బేలు దూదిలో 4.25 కిలోలే వ్యర్థాలుండాలని నిబంధన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల నుంచి మద్దతు ధరకు కొన్న పత్తిలో చెత్తాచెదారం, వ్యర్థాలుంటున్నాయని జిన్నింగ్‌ మిల్లులకు ‘భారత పత్తి సంస్థ’(సీసీఐ) భారీగా జరిమానాలు విధిస్తోంది. తెలంగాణ జిన్నింగ్‌ మిల్లులు ఇచ్చిన బేళ్లలో 2.5 శాతానికి మించి చెత్తాచెదారం ఉందంటూ ఆరు నెలల కాలంలో రూ.5 కోట్ల వరకూ జరిమానా విధించింది. సాధారణంగా ఏటా అక్టోబరు నుంచి మే నెల వరకూ రైతుల నుంచి సీసీఐ పత్తిని మద్దతు ధరకు కొంటుంది. 2019-20, 2020-21లలో రాష్ట్రంలో 60 లక్షల బేళ్ల పత్తిని కొన్నది. (170 కిలోల చొప్పున దూదిని బేలు అని పిలుస్తారు.) ఈ పత్తిని జిన్నింగ్‌ మిల్లులకు తరలించి.. దాని నుంచి గింజలు, చెత్తాచెదారం తొలగించి నాణ్యమైన దూదిని వేరుచేస్తారు. 170 కిలోల(బేలు) చొప్పున ప్యాక్‌ చేసి గోదాములకు పంపుతారు. ఇలా శుభ్రం చేయడాన్ని ‘జిన్నింగ్‌’ అంటారు. దూది శుభ్రంగా ఉందా, లేదా తనిఖీ చేసుకున్న తరవాత మిల్లులకు సీసీఐ జిన్నింగ్‌ ఛార్జీలను చెల్లిస్తుంది. ప్రతి బేలులో 2.5 శాతం(4.25 కిలోలు)కు మించి చెత్తాచెదారం(ట్రాష్‌) ఉంటే సీసీఐ జరిమానా విధిస్తుంది. రాష్ట్రంలోని 380 మిల్లులకు చెల్లించాల్సిన జిన్నింగ్‌ ఛార్జీల్లో ఇటీవల రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకూ కోత(జరిమానా) విధించింది. దీనిపై రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖకు మిల్లుల యాజమాన్యాలు ఫిర్యాదు చేశాయి. జరిమానాలు ఆపకపోతే ఈ నెల నుంచి ప్రారంభమైన కొత్త మార్కెటింగ్‌ సీజన్‌లో పత్తి కొనుగోలులో సీసీఐకి సహకరించబోమని జిన్నింగ్‌ మిల్లుల సంఘం హెచ్చరించింది. సీసీఐ ఉన్నతాధికారిని వివరణ కోరగా.. నాణ్యతను పరీక్షించి ట్రాష్‌ ఎక్కువ ఉంటేనే జరిమానా వేస్తున్నట్లు స్పష్టంచేశారు.


పరీక్షలు చేయడంలో సీసీఐ జాప్యం

దూది నాణ్యంగా ఉందా, ట్రాష్‌ 4.25 కిలోల్లోపే ఉందా లేదా ప్రయోగశాలలో పరీక్షించడంలో సీసీఐ ఏళ్ల తరబడి జాప్యం చేస్తోంది. 2019-20లో మిల్లులు ప్యాక్‌ చేసిన బేళ్లకు ఇప్పుడు జరిమానా విధించడం అన్యాయం. వెంటనే పరీక్షలు చేసి చెబితే 4.25 కిలోలకు మించి ఉన్న వ్యర్థాల మేరకు అదనంగా దూది ఇవ్వడానికి మిల్లులకు అవకాశముంటుంది.

-కె.రమేశ్‌, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర జిన్నింగ్‌ మిల్లుల సంఘం


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని