పర్యాటకాభివృద్ధికి సంపూర్ణ సహకారం

ప్రధానాంశాలు

పర్యాటకాభివృద్ధికి సంపూర్ణ సహకారం

వరంగల్‌ విమానాశ్రయానికి ఉడాన్‌ రాయితీలు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి; రామప్ప, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లోనే రామప్పగుడికి ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం మనకు గర్వకారణమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయాన్ని గురువారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సందర్శించారు. ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రజా మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కేంద్ర మంత్రి పదవి స్వీకరించిన తర్వాత మొదటగా రామప్పకు యునెస్కో గుర్తింపు అంశమే పరిశీలించా. ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్లగా వ్యతిరేకించిన దేశాలతో మాట్లాడి యునెస్కో గుర్తింపు దక్కేలా కృషి చేశారు. రామప్పతో పాటు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తా. ఇప్పటికే ట్రైబల్‌ సర్క్యూట్‌ కింద గట్టమ్మ, లక్నవరం, మేడారం, మల్లూరు, బొగత తదితర ప్రాంతాల్లో హోటళ్లు, కాటేజీల నిర్మాణం కోసం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేశాం. జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, సోమశిల, శ్రీశైలం ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. హనుమకొండలో వెయ్యి స్తంభాల గుడి పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తిచేస్తాం. రామప్ప, వెయ్యిస్తంభాల గుడి, ఖిలా వరంగల్‌ కోట, గోల్కొండ, ఆలంపూర్‌, చార్మినార్‌ను మరింత అభివృద్ధి పరుస్తాం. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రన్‌వేలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే ఉడాన్‌ పథకం కింద పర్యాటకులకు రాయితీలు కల్పిస్తాం. కొవిడ్‌ టీకా పంపిణీ 100 కోట్లకు చేరుకోవడం శుభపరిణామం. త్వరలోనే 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకా పంపిణీ చేస్తాం’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రామప్ప ఆలయానికి వారసత్వ గుర్తింపునకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనలేని కృషి చేశారని చెప్పారు. చార్మినార్‌ ప్రాంతంలో త్వరలోనే బుద్ధవనం ప్రారంభం కానుందన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. రామప్పలో శిల్పకళా కళాశాల ఏర్పాటు చేయాలని విన్నవించారు.


వందరోజుల్లో పూర్తి చేయండి

ఈనాడు, వరంగల్‌: హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి గురువారం సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న కల్యాణమండపాన్ని పరిశీలించారు. సుమారు 16 ఏళ్లుగా కొనసాగుతున్నా పనులు ఎందుకు పూర్తి కావడం లేదని కేంద్ర పురావస్తు శాఖ అధికారులను ప్రశ్నించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని