రాష్ట్రంలో ఆక్సిజన్‌కు లోటుండదు

ప్రధానాంశాలు

రాష్ట్రంలో ఆక్సిజన్‌కు లోటుండదు

ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది

కరోనా పోయింది అనుకోవద్దు

రెండు డోసులూ తప్పక పొందాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా పోయిందని అనుకోవద్దని, అందరూ తప్పనిసరిగా టీకా రెండు డోసులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. రెండు డోసులు పొందిన వారిలో ప్రమాదం లేదన్నారు. మూడోదశ ఉద్ధృతి వస్తుందో రాదో తెలియదనీ, ప్రభుత్వం మాత్రం సర్వ సన్నద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించామని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఆక్సిజన్‌కు లోటు ఉండదన్నారు. 300 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం పెరిగిందన్నారు. రాష్ట్రంలో కోటి మందికి టీకా ఇవ్వడానికి 169 రోజులు పడితే.. మరో కోటి మందికి 81 రోజుల్లో ఇచ్చామని తెలిపారు. మూడో కోటి మందికి ఇవ్వడానికి కేవలం 36 రోజులే పట్టిందన్నారు. దేశవ్యాప్తంగా 100 కోట్ల టీకాలను, రాష్ట్రంలో 3 కోట్ల డోసులను అధిగమించిన సందర్భంగా శుక్రవారం కోఠిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్‌ టి.గంగాధర్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో కలిసి సీఎస్‌ కేకు కోసి, వైద్యసిబ్బంది సేవలను అభినందించారు. ‘రోజుకు సగటున 3 లక్షల డోసులు పంపిణీ చేస్తున్నాం. జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ముందంజలో ఉంది’ అని సోమేశ్‌కుమార్‌ తెలిపారు. వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ మాట్లాడుతూ.. అలసట లేకుండా శ్రమించారని పేర్కొంటూ వైద్యఆరోగ్యశాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని