20 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గాలి

ప్రధానాంశాలు

20 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గాలి

ఆ మేరకు ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలి

ప్రభుత్వానికి వ్యవసాయశాఖ ప్రతిపాదన

యాసంగి సాగు లక్ష్యం 69 లక్షల ఎకరాలుగా అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే కనీసం 20 లక్షల ఎకరాలు తగ్గించేలా రైతులను చైతన్యపరచాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. గతేడాది యాసంగిలో 52.50 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, ఈ సీజన్‌లో 32.50 లక్షల ఎకరాలకు పరిమితంచేస్తే మేలు అని తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వరి సాగుచేసినా సన్నరకాల వంగడాలే వేసేలా ప్రోత్సహించాలని పేర్కొంది.

ఈ సీజన్‌లో మొత్తం 69 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా. ఇందులో 54 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని భావించిన వ్యవసాయశాఖ ముందుగానే 15 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేసింది. ఈ సాగు తగ్గించాలని తాజాగా నిర్ణయించడం, సన్న రకాలే సాగుచేయించేలా అన్నదాతలను ప్రోత్సహించాలని భావిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సన్న రకాల విత్తనాలను రైతులకు విక్రయించేందుకు టీఎస్‌ సీడ్స్‌ ఏర్పాట్లుచేస్తోంది.

ప్రత్యామ్నాయ పంటల దిశగా

వరిసాగును 20 లక్షల ఎకరాలకు తగ్గించే క్రమంలో సదరు రైతులతో ప్రత్యామ్నాయంగా నువ్వులు, పొద్దుతిరుగుడు, వేరుసెనగ, సెనగ, మినుము, పెసర, కుసుమ, ఆముదం తదితర పంటలు సాగుచేయించాలని, ఆయా పంటల విస్తీర్ణాలు గతేడుకన్నా ఎక్కువుండేలా చూడాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన విత్తనాలు సిద్ధం చేస్తోంది. ఉదాహరణకు గతేడు యాసంగిలో వేరుసెనగ 2.78 లక్షల ఎకరాల్లోనే సాగవగా, ఈ సీజన్‌లో దాన్ని విస్తీర్ణం 3.50 లక్షల ఎకరాలకు పెంచేందుకు అవసరమైన విత్తనాలను సిద్ధంచేసినట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్‌ సీడ్స్‌) తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. అలాగే సెనగ పంట 3.54 లక్షల ఎకరాల నుంచి 4 లక్షల ఎకరాలకు పెంచాలని, అందుకు అవసరమైన లక్షా 58 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని వివరించింది. యాసంగిలో మరో ప్రధాన పంటయిన మొక్కజొన్న గతేడాది 4.66 లక్షల ఎకరాల్లో వేయగా, ఈ ఏడాది దాన్ని 3 లక్షల ఎకరాలకు తగ్గించాలని పేర్కొంది. ‘‘పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను మద్దతు ధరకు కొంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధానంగా మినుము ఎంత సాగుచేసినా మద్దతు ధరకు లేదా మార్కెట్‌ ధర ఎంత ఉంటే అంతకు కొనడానికి కేంద్రం తాజాగా అనుమతించింది. మినుము, పెసర, సెనగ, వేరుసెనగ వంటి పంటలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉన్నందున వాటి సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాం’’ అని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.


ప్రైవేటు విత్తులే దిక్కు

మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, కుసుమ వంటి పంటలకు రైతులు ఎక్కువగా సంకరజాతి విత్తనాలే వాడతారు. అవి ప్రైవేటు కంపెనీల వద్దనే ఉన్నాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఉదాహరణకు మొక్కజొన్న సంకరజాతి విత్తనాలు కూడా టీఎస్‌ సీడ్స్‌ వద్ద లేవు. మూడు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేయాలంటే కనీసం 30 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. టీఎస్‌ సీడ్స్‌ వద్ద కేవలం 169 క్వింటాళ్లే ఉన్నాయి. ఈ పంట సాగును తగ్గించాలని ప్రభుత్వం చెబుతున్నందున విత్తనాలు పెద్దగా నిల్వ పెట్టలేదని అధికారులు తెలిపారు.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని