కఠిన లక్ష్యాలను సాధిస్తున్నాం

ప్రధానాంశాలు

కఠిన లక్ష్యాలను సాధిస్తున్నాం

శతకోటి టీకాలతో భారత శక్తిని చాటాం

పళ్లేలు మోగిస్తే కరోనా పోతుందా? అని ప్రశ్నించారు

మన విజయమే వారికి సమాధానం

వంద కోట్ల టీకా డోసులు ఒక అంకె కాదు.. అది మన ఐక్యతను చాటింది

జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ

ఈనాడు, దిల్లీ: ‘‘కఠిన లక్ష్యాలను సాధించగల ఆధునిక భారతమిది. అందుకు తార్కాణం.. 9 నెలల్లో శతకోటి టీకా డోసుల మైలురాయి దాటడమే. మహమ్మారిపై పోరాటంలో జన భాగస్వామ్యమే పెద్ద ఆయుధంగా పనిచేసింది. దేశ ఐక్యతను చాటిచెప్పడానికి ప్రజలు పళ్లేలు మోగించారు. దీపాలు వెలిగించారు. కొందరు మాత్రం దాంతో మహమ్మారి పారిపోతుందా? అని ప్రశ్నించారు. కానీ మనందరికీ అందులో దేశ ఐక్యత, సామూహికశక్తి కనిపించింది. దానివల్ల ఇంత తక్కువ సమయంలో 100 కోట్ల డోసుల టీకాను అందివ్వగలిగాం. సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ నినాదానికి ఇది సజీవ ఉదాహరణ’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం 100 కోట్ల టీకాలను పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

‘‘భారత్‌ శతకోటి టీకాను పూర్తిచేసి కఠినమైన అసాధారణ లక్ష్యాన్ని పూర్తిచేసింది. దీని వెనుక 130 కోట్ల మంది భారతీయుల కర్తవ్యదీక్ష ఉంది. 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు కేవలం ఓ అంకె మాత్రమే కాదు. దేశ సామూహిక సామర్థ్యానికి ప్రతిబింబం. చరిత్రలో కొత్త అధ్యాయం లిఖింపు. కఠిన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడం తెలిసిన కొత్త భారతం ఇది. ఇప్పుడు ఎంతోమంది భారత్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలతో పోల్చిచూస్తున్నారు. అభినందనలు తెలుపుతున్నారు.

అనుమానాలు పటాపంచలు

ప్రపంచంలోని కొన్ని దేశాలకు వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేసే శక్తిసామర్థ్యాలు దశాబ్దాల క్రితం నుంచి ఉంది. ఈ దేశాలనుంచి వచ్చే వ్యాక్సిన్లపైనే భారత్‌ ఆధారపడుతూ వచ్చింది. అందుకే మహమ్మారి వచ్చినపుడు భారత్‌ దీంతో పోరాడుతుందా, విదేశాలనుంచి టీకాలు తెప్పించుకోవడానికి డబ్బులు ఎక్కడినుంచి తెస్తుంది? వ్యాక్సిన్‌ ఎవరిస్తారు? ప్రజలందరికీ టీకా వేయగలుగుతుందా? లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. వీటికి 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సమాధానమిచ్చాయి. ప్రపంచ ఔషధ కర్మాగారంగా భారత్‌కున్న పేరు దీనివల్ల మరింత బలపడింది. రోగానికి భేదభావాలు లేనప్పుడు వ్యాక్సిన్‌లోనూ విచక్షణకు తావుండకూడదని పంపిణీ కార్యక్రమంలో వీఐపీ సంస్కృతి ప్రభావం పడనీయలేదు. డబ్బున్నవారు, పెద్ద పదవుల్లో ఉన్నవారికీ సామాన్యుడి తరహాలోనే వ్యాక్సిన్‌ అందించాలని చెప్పాం.

రికార్డు స్థాయిలో పెట్టుబడులు

ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాక్సిన్‌ సంశయం సవాల్‌గా మారినప్పటికీ భారతీయులు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి టీకా తీసుకున్నారు. భారత్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిగా శాస్త్రసాంకేతికత ఆధారంగా నడుస్తోంది. కోవిన్‌ సాంకేతిక వేదిక సామాన్యుడికి టీకా సేవలను దగ్గర చేయడంతోపాటు, వైద్యసిబ్బంది పనిని సులభతరం చేసింది. ఇప్పుడు భారత్‌ ఆర్థిక వ్యవస్థ పట్ల జాతీయ, అంతర్జాతీయ నిపుణులు సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తంచేస్తున్నారు. భారత సంస్థల్లోకి రికార్డుస్థాయిలో పెట్టుబడులు రావడమే కాకుండా, యువతకు ఉద్యోగాలు పెరుగుతున్నాయి. మేడిన్‌ ఇండియా వస్తువులకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రజలంతా పండుగలను అప్రమత్తంగా చేసుకోవాలి. పాదరక్షలు వేసుకొని బయటికెళ్లడం ఎలా అలవాటు చేసుకున్నామో అలాగే మాస్క్‌ ధరించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని