Chandrababu: ఎక్కడున్నా శిక్షిస్తాం

ప్రధానాంశాలు

Chandrababu: ఎక్కడున్నా శిక్షిస్తాం

తెదేపా అధికారంలోకి రాగానే కమిషన్‌ వేస్తాం

ప్రభుత్వ ఉగ్రవాదానికి చరమగీతం పాడాలనే రాష్ట్రపతి పాలన కోరాం

36 గంటల నిరశన విరమణ ప్రసంగంలో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్యాయం చేసినవారు ఎక్కడున్నా పట్టుకొస్తాం, చట్టప్రకారం శిక్షిస్తాం. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కమిషన్‌ వేస్తాం.. పోలీసులు, అధికారులకు చెబుతున్నా..  తప్పుడు కేసులు పెడితే రేపు అనేది ఉందని మర్చిపోవద్దు..’ అని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కార్యకర్తలంతా ఉక్కు సంకల్పంతో రావాలి. ఎవరిమీదైనా కేసులు పెడితే నేను చూసుకుంటా. మీరేమీ లక్షల కోట్లు దోచుకున్న వాళ్లు కాదు... తప్పుడు కేసులు పెడితే రికార్డు చేయండి. లాయర్లను పెట్టుకుని వాదిద్దాం. ఆ అధికారిపై ప్రైవేటు కేసు పెడదాం. తెదేపా వచ్చాక మీపై కేసులు లేకుండా చేస్తా’ అని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.  ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 36 గంటల నిరాహారదీక్ష చేపట్టిన ఆయన.. శుక్రవారం రాత్రి 8.30కు విరమించారు. వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ‘డీజీపీ కార్యాలయం, బెటాలియన్‌కు సమీపంలోని తెదేపా కార్యాలయంపై ప్రభుత్వ ఉగ్రవాదంతోనే దాడి చేశారు. డీజీపీ అనుకుని ఉంటే ఇది జరిగేదా? పట్టాభిపై గతంలో దాడి చేశారు. మొన్న ఆయన ఇల్లు నాశనం చేశారు. ఆయన కుమార్తె మానసికంగా కోమాలోకి వెళ్లే పరిస్థితికి తెచ్చారు. అయినా దాడిచేసిన వారిపై కేసు లేదు. తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడుల విషయంలో సీబీఐ విచారణ చేయించాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రం నాశనమైపోతోందనే రాష్ట్రపతి పాలన అడుగుతున్నాం. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు సమయం అడిగాం’ అని చెప్పారు.

తల్లికి, చెల్లికి న్యాయం చేయలేదేం?

‘పట్టాభి ఏదో తిట్టారంట.. ‘ఆ’ పదమే ఎప్పుడూ వినలేదు. ఆయన ఏదో మాట్లాడారని రీసెర్చి చేసి.. తల్లినీ లాక్కొచ్చారు. తల్లిపై ఎంత మమకారం జగన్‌రెడ్డీ? మీరు జైలుకు పోయినప్పుడు తల్లిని ఊరూరూ తిప్పారు. నన్ను కౌంటర్‌ చేయడానికి ఆ చెల్లి జగనన్న బాణం అని పాదయాత్ర పెట్టారు. ఇప్పుడా బాణం తెలంగాణలో తిరుగుతోంది. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని మీరు.. నీతులు చెబుతారా?’అని చంద్రబాబు మండిపడ్డారు.  


ఎల్లుండి రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు  

చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలు సోమవారం దిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. మాదకద్రవ్యాలకు, గంజాయికి ఆంధ్ర ప్రదేశ్‌ అడ్డాగా మారిందని, ప్రభుత్వంలోని వ్యక్తులే దాన్ని ప్రోత్సహిస్తున్నారని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపిస్తున్న తెదేపా.. అదే విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది. శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనందున  రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నట్టు సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని