పరీక్షలు తప్పితే మళ్లీ రాయాల్సిందే

ప్రధానాంశాలు

పరీక్షలు తప్పితే మళ్లీ రాయాల్సిందే

భయపడకుండా ఆత్మవిశ్వాసంతో హాజరవ్వండి

ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో తప్పితే కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయం. మళ్లీ వారు మార్చి/ఏప్రిల్‌లో పరీక్షలు రాసి పాస్‌ కావాల్సిందేనని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ చెప్పారు. ప్రభుత్వంతో చర్చించి వీలుంటే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ తరహాలో మరోసారి పరీక్షలు జరిపేందుకు ఆలోచిస్తామన్నారు. రాష్ట్రంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల అధికారి అబ్దుల్‌ ఖాలిక్‌, ఓఎస్‌డీ సుశీల్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శులు భీమ్‌సింగ్‌, శ్రీనివాస్‌ తదితరులతో కలిసి జలీల్‌ శనివారం విలేకర్లతో మాట్లాడారు. ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు భయపడకుండా.. ఆత్మవిశ్వాసంతో హాజరు కావాలని జలీల్‌ సూచించారు. ఒకవేళ కరోనా కారణంగా వచ్చే మార్చి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేని పరిస్థితులు తలెత్తితే తొలి ఏడాది పరీక్షల్లో వచ్చిన మార్కులనే ప్రామాణికంగా తీసుకొని రెండో ఏడాదికి కేటాయించి ఉత్తీర్ణులను చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే ఎగ్జామ్స్‌ జరపాల్సిన అనివార్య పరిస్థితి ఉందని, ప్రతి విద్యార్థి తప్పకుండా రాయాలని సూచించారు. ఈ సందర్భంగా విలేకరులడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

* హాల్‌ టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదు.

* ఇంటర్‌ తొలి ఏడాది చదివిన కళాశాల ఉన్న జోన్‌ పరిధిలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించాం. రెండో ఏడాదిలో మరో కళాశాలకు మారినా ఇప్పుడు ఫస్టియర్‌ చదివిన కళాశాల ప్రాంతంలోనే పరీక్ష రాయాలి.

* ఒక్కో కేంద్రంలో రెండు ఐసొలేషన్‌ గదులుంటాయి. జ్వరం, జలుబు ఉన్నవారు అక్కడ పరీక్ష రాస్తారు. పాజిటివ్‌ ఉన్నవారిని అనుమతించ[ం.

* నవంబరు తొలివారంలో జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం.

* దాదాపు 400 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఆ ప్రక్రియను నవంబరు నెలాఖరులోపు పూర్తి చేస్తాం.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని