ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ ఇదే

ప్రధానాంశాలు

ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ ఇదే

కేంద్ర తాజా మార్గదర్శకాలు అమలుకు పురపాలకశాఖ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: నిర్దేశించిన అవసరానికి ఉపయోగించి తర్వాత వ్యర్థంగా పడేయడం లేదా రీసైకిల్‌ చేసే ప్లాస్టిక్‌నే ఒకే ఒక్కసారి ఉపయోగించేది (సింగిల్‌ యూజ్‌)గా కేంద్రం స్పష్టం చేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ విధానం నిబంధనలను కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా విడుదల చేసింది. వీటిని తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో అమలు చేయాలని కమిషనర్లను ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ నిబంధనలు:  క్యారీ బ్యాగ్‌లు, ప్లాస్టిక్‌ కవర్లు 75 మైక్రాన్ల కంటే తక్కువ ఉండకూడదు. ప్లాస్టిక్‌ ఫైబర్‌తో తయారైన నాన్‌ వూవెన్‌ పాలి ప్రొఫైన్‌ బ్యాగ్‌లు కూడా 60 మైక్రాన్ల కంటే తక్కువ ఉండకూడదు. వీటి కంటే తక్కువ పరిమాణంతో ఉండే వాటిని ఒకే  ఒక్కసారి వాడే ప్లాస్టిక్‌గా పరిగణిస్తారు. గత నెల 30వ తేదీ నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చిందని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. ప్లాస్టిక్‌ కవర్లు, క్యారీబాగ్‌లు 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉండకూడదనే నిబంధన వచ్చే ఏడాది డిసెంబరు 31వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. వీటితోపాటు నిర్దేశించిన   ప్లాస్టిక్‌ వినియోగంపై వచ్చే ఏడాది జులై ఒకటో తేదీ నుంచి నిషేధం ఉంటుందని తెలిపారు. వీటి తయారీ, విక్రయం, వినియోగం, దిగుమతి చేసుకోవడం, నిల్వలు ఉంచడం, పంపిణీ అన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది జులై 1 నుంచి ఇవి నిషేధం

ఇయర్‌ బడ్‌లు, బెలూన్లు, జెండాలు, క్యాండీలు, ఐస్‌క్రీంలకు ప్లాస్టిక్‌ పుల్లల వినియోగం.
అలంకరణ (డెకరేషన్‌)లకు థర్మాకోల్‌ (పాలిస్ట్రిన్‌) ఉపయోగించడం.
ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, కత్తులు, స్పూన్లు, ట్రేలు, స్వీట్‌ బాక్సులు, ఆహ్వాన పత్రికలు, సిగరెట్‌ పెట్టెలకు ప్లాస్టిక్‌ రేపర్‌ చుట్టడం నిషేధం.
వంద మైక్రాన్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్‌ లేదా పీవీసీ బ్యానర్లు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని