ముందే అమ్మేసుకున్నారు!

ప్రధానాంశాలు

ముందే అమ్మేసుకున్నారు!

కొత్త బీటెక్‌ సీట్లకు ఇంకా అనుమతివ్వని ప్రభుత్వం
యాజమాన్య కోటా సీట్లు పొందిన విద్యార్థుల్లో టెన్షన్‌

ఈనాడు, హైదరాబాద్‌: కంప్యూటర్‌ సైన్స్‌, సంబంధిత బీటెక్‌ బ్రాంచీల సీట్లకు విద్యార్థుల నుంచి ఉన్న డిమాండ్‌ను బట్టి ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. యాజమాన్య కోటాలోనివే కాకుండా.. మరిన్ని సీట్లకు అనుమతి వస్తుందని చెప్పి... ఆ సీట్లను రూ.లక్షలకు అమ్ముకున్నాయి. అనుమతులు రాకుంటే చెల్లించిన డొనేషన్‌ మొత్తాన్ని తిరిగి ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. శంషాబాద్‌ ప్రాంతంలోని ఓ కళాశాలలో ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సులో సీట్లు పెరుగుతాయని చెబుతూ.. ఒక్కో సీటును రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలకు అమ్మినట్లు సమాచారం. డొనేషన్‌ మొత్తాన్ని చెల్లిస్తేనే సీటు రిజర్వుచేశారు. ఘట్‌కేసర్‌ ప్రాంతంలోని మరో కళాశాలతో పాటు పలుచోట్ల ఇదే దందా కొనసాగుతోంది. ఇలా 30 శాతం (సుమారు 1200)సీట్లను కళాశాలలు అమ్ముకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఏటా కన్వీనర్‌ కోటా ద్వారా 50 వేల మంది బీటెక్‌లో చేరుతున్నారు. వారిలో 75 శాతం మంది (37,500) బోధన రుసుములు పొందేందుకు అర్హులు. వారికి రూ.200 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. యాజమాన్య కోటా కింద 18 వేల మంది చేరుతున్నారు. వారిలో 90 శాతం మంది కంప్యూటర్‌ సైన్స్‌, సంబంధిత బ్రాంచీల వారే. 15 వేల సీట్లకు ఒక్కో దానికి రూ.2 లక్షలు అనుకున్నా రూ.300 కోట్లు డొనేషన్ల పేరిట తల్లిదండ్రులు ఆయా కళాశాలలకు చెల్లిస్తున్నారు.

4 వేల సీట్లు వస్తాయని..!

డిమాండ్‌ లేని బ్రాంచీల్లో సీట్లను రద్దు చేసుకోవడంతో పాటు కొత్తగా పెంచుకునేలా అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నుంచి కళాశాలలు అనుమతులు పొందాయి. జేఎన్‌టీయూహెచ్‌ మాత్రం రాష్ట్రప్రభుత్వం ఎన్‌ఓసీ ఇస్తేనే ఆ సీట్లను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో చేరుస్తామని చెప్పింది. కళాశాలలు హైకోర్టును ఆశ్రయించడంతో వాటికి ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ అవసరం లేదని, అనుమతి ఇవ్వాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం అనుమతిస్తే దాదాపు 4 వేల సీట్లు పెరుగుతాయి. అనుమతి ఇవ్వకుండా కౌన్సెలింగ్‌ మొదలుపెడితే ఇంజినీరింగ్‌ కళాశాలలు మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అందుకే ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ శుక్రవారం ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ కాలపట్టికను ప్రకటించినా ప్రభుత్వ ఆదేశాల మేరకు దాన్ని అధికారులు విరమించుకున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని