అతివలను అందలమెక్కిద్దాం

ప్రధానాంశాలు

అతివలను అందలమెక్కిద్దాం

మహిళా సంక్షేమ తీర్మానంపై చర్చలో కేసీఆర్‌

తెరాస ప్లీనరీకి హాజరైన మహిళా ప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: మహిళలను గౌరవించాలని, వారి ప్రతిభాపాఠవాలు వెలుగులోకి వచ్చేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పురుషులతో సమానంగా అతివలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. మహిళా సంక్షేమ తీర్మానంపై చర్చ సందర్భంగా సత్యవతి ప్రసంగం అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘మహిళలు గౌరవం, భద్రత పొందినపుడే దేశం బాగుపడుతుంది. వ్యవస్థలో ఉత్పాదక, అనుత్పాదక రంగాలు ఉంటాయి. గొప్ప దేశాల్లో ప్రతిభావంతులైన మహిళలను ఉత్పాదక రంగంలో, తక్కువ ప్రతిభ ఉన్నవారిని అనుత్పాదక రంగంలో ఉంచుతారు. మన దేశంలో అలా లేదు. మహిళలు అనగానే వంటింట్లోనే ఉండాలి అనేటట్టు తయారు చేశారు. మేం బలాదూర్‌గా తిరగాలి అనేటట్టు పురుషులు తయారయ్యారు. మహిళల్లో గొప్ప ప్రతిభాశాలులు ఉన్నారు. మగవాళ్లలో సన్నాసులు లేరా? ప్రతిభావంతులైన మహిళలను సమాజంలో ముందు వరుసలో ఉంచకపోతే ఈ దేశం బాగుపడదు.

అనాథలకు సర్కారే అన్నీ..  
అనాథలను అన్ని విధాలా ఆదుకుంటాం. గతంలో నేనో సమావేశానికి వెళ్లే ముందు.. ఒక్క నిమిషం మాట్లాడతామని చెప్పి ఇద్దరు బాలికలు నా దగ్గరకు వచ్చారు. మేము అనాథ పిల్లలం.. కేజీబీవీలో చదువుతున్నాం. టెన్త్‌ అయిపోతుంది. తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని చెప్పారు. నేను చాలా బాధపడ్డాను. మన బిడ్డకే ఆ పరిస్థితి సంభవిస్తే ఏమిటని ఆలోచించాను. అనాథ పిల్లల కోసం ప్రభుత్వం త్వరలోనే మంచి కార్యాచరణను రూపొందించి తీసుకువస్తాం. కేజీబీవీలను ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేశాం. రాష్ట్ర ప్రభుత్వమే అనాథలకు తల్లిదండ్రి’’ అని సీఎం అన్నారు.

వచ్చేసారి రెండు రోజులు ప్లీనరీ
రాబోయే ప్లీనరీని రెండురోజుల పాటు నిర్వహిస్తామని తెరాస అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విద్య, వైద్యరంగంపై తీర్మానం సందర్భంగా ఈ మేరకు విన్నపం చేయగా ఆయన అంగీకరించారు. ఈవిషయమై ప్రతినిధుల అభిప్రాయం కోరగా మద్దతు తెలిపారు.

 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని