ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వండి

ప్రధానాంశాలు

ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వండి

 విద్యార్థులకు గవర్నర్‌ తమిళిసై సూచన

ఘనంగా ఓయూ 81వ స్నాతకోత్సవం

బంగారు పతకం అందజేస్తున్న గవర్నర్‌ తమిళిసై. చిత్రంలో వీసీ రవీందర్‌, డీఆర్డీవో ఛైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌- ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: విద్యార్థులు ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. నిత్యం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూనే సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 81వ స్నాతకోత్సవం బుధవారం వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వర్సిటీ కులపతి తమిళిసై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం 2018-19, 2019-20 సంవత్సరాలకు ప్రథమస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు.

ఆవిష్కరణల వేదికలు వర్సిటీలు: సతీష్‌రెడ్డి

స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఆర్డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి మాట్లాడుతూ..విశ్వవిద్యాలయాలనేవి ఆవిష్కరణలకు ప్రారంభ వేదికలని, ఇక్కడ చేపట్టే పరిశోధనల ఆధారంగా డీఆర్డీవో వంటి సంస్థల సాయంతో ఉత్పత్తులు తీసుకొచ్చేందుకు వీలవుతుందన్నారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఫండింగ్‌ కార్యక్రమంలో రక్షణ రంగానికి ఉపయోగపడే ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ.పది కోట్ల వరకు సమకూర్చుతున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయ స్థాయిలో లోతైన పరిశోధనలు జరగాలన్నారు. ఆవిష్కరణలు ప్రపంచానికి ఉపయోగపడేవే కాకుండా తక్కువ ఖర్చు, సరికొత్త సాంకేతికతతో కూడుకున్నవిగా ఉండాలని సూచించారు. పరిశోధనలపరంగా మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని, ఇందుకు యూనివర్సిటీలు వేదికలు కావాలన్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా రక్షణరంగంలో దిగుమతి స్థాయి నుంచి ఎగుమతి స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌ మాట్లాడుతూ..వర్సిటీ అభివృద్ధికి 21 అంశాల అజెండాతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అందించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, ఉపకులపతులు కట్టా నర్సింహారెడ్డి, సీహెచ్‌.గోపాల్‌రెడ్డి, రవీందర్‌గుప్తా, మాజీ ఉపకులపతి తిరుపతిరావు, ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని