సాగు చట్టాల రద్దుకు కేబినెట్‌ సమ్మతి

ప్రధానాంశాలు

సాగు చట్టాల రద్దుకు కేబినెట్‌ సమ్మతి

పేదలకు మార్చి వరకు ఉచితంగా తిండి గింజలు

ఈనాడు, దిల్లీ: మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు, ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ కింద పేదలకు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని మార్చి వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ తెలిపారు. వ్యవసాయ చట్టాలపై కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిందని, ఈ నెల 29న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే బిల్లు ప్రవేశపెట్టి ఆ చట్టాలను ఉపసంహరిస్తామని చెప్పారు. ప్రధాని ఇచ్చిన మాటకు కట్టుబడి కేబినెట్‌లో ఆమోదం తెలిపామనీ, అదే ప్రాధాన్యంతో పార్లమెంటు ముందుకూ బిల్లు తీసుకొస్తామని పేర్కొన్నారు. దీనిపై ఎవరికీ అనుమానం అవసరం లేదని, పార్లమెంటు తొలిరోజు నుంచే తాము ఆ ప్రయత్నాలు మొదలుపెడతామని చెప్పారు. కనీస మద్దతు ధరలు సహా ఇతర అంశాలపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వలేదు.

మరో 4 నెలల పాటు పేదలకు ఆసరా

దేశంలో 80 కోట్లమంది పేదలకు ఉచితంగా తిండి గింజలు అందించేందుకు 15 నెలలుగా కొనసాగుతూ వచ్చిన పథకాన్ని కొవిడ్‌ నేపథ్యంలో మరో నాలుగు నెలలు పొడిగిస్తున్నట్లు ఠాకుర్‌ వెల్లడించారు. నెలకు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు అందించనున్నట్లు చెప్పారు. దీనివల్ల రూ.53,344 కోట్లు అదనంగా ఖర్చవుతుందన్నారు. జాతీయ ఆహారభద్రత, అంత్యోదయ పథకాల కింద ఇప్పటికే అందిస్తున్నవాటికి అదనంగా వీటిని సమకూర్చనున్నట్లు చెప్పారు.

రూ.3,054 కోట్లతో అప్రెంటీస్‌ కార్యక్రమం

జాతీయ అప్రెంటీస్‌ శిక్షణ కార్యక్రమాన్ని (నాట్స్‌ను) రూ.3,054 కోట్ల వ్యయంతో మరో అయిదేళ్లు పొడిగించడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2021-26 మధ్య 9 లక్షల మందికి శిక్షణ ఇవ్వడానికి, నెలకు రూ.9000 వరకు శిక్షణ భృతితో మరిన్ని రంగాల వారికి అవకాశం కల్పించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇంజినీరింగ్‌తో పాటు హ్యుమానిటీస్‌, సైన్స్‌, కామర్స్‌ విద్యార్థులకూ నైపుణ్యాభివృద్ధి శిక్షణను విస్తరిస్తారు. మొత్తంమీద దాదాపు ఏడు లక్షల మందికి ఉపాధి కల్పించేలా నైపుణ్య స్థాయిని పెంచుతారు.

2021-26 మధ్య ఒ-స్మార్ట్‌ పేరుతో సముద్ర సంబంధిత పరిశోధనలను రూ.2,177 కోట్లతో, వాతావరణంపై పరిశోధనలను రూ.2,135 కోట్లతో కొనసాగించడానికి మంత్రివర్గం అంగీకరించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని