నేవీకి శుభ‘వేలా’

ప్రధానాంశాలు

నేవీకి శుభ‘వేలా’

అమ్ములపొదిలో అధునాతన జలాంతర్గామి
మన సాగరగర్భం ఇక శత్రు దుర్భేద్యం  

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి.. ఏర్పాట్లలో నౌకాదళ అధికారులు

ముంబయి: సాగర గర్భంలో భారత నౌకాదళ పోరాటపటిమ మరింత ఇనుమడించింది. స్కార్పీన్‌ తరగతికి చెందిన అధునాతన జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ వేలా’ మన అమ్ములపొదిలో చేరింది. నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ గురువారం ఇక్కడ లాంఛనంగా దీన్ని నేవీలో ప్రవేశపెట్టారు. ఆధునిక టోర్పిడోలు, క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం ఐఎన్‌ఎస్‌ వేలా సొంతం. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌తో కలిసి ముంబయిలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ దీనిని తయారు చేసింది. వారం వ్యవధిలో నౌకాదళ అమ్ములపొదిలో చేరిన రెండో ప్రధాన ఆయుధ వ్యవస్థ ఇది. ఈ నెల 21న యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ నేవీలో చేరిన సంగతి తెలిసిందే. పి-75 ప్రాజెక్టు నిర్మిస్తున్న ఆరు జలాంతర్గాముల్లో ఐఎన్‌ఎస్‌ వేలా నాలుగోది. ఈ సందర్భంగా కరంబీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు భారీ స్థాయిలో యుద్ధనౌకలు, జలాంతర్గాములను చైనా ఎగుమతి చేస్తోందన్నారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. చైనాకు చెందిన పరిశోధన, నిఘా సమాచార సేకరణ, సర్వే నౌకలు హిందూ మహా సముద్రంలోకి వస్తున్నాయని, వాటిపై కన్నేసి ఉంచామన్నారు. స్కార్పీన్‌ శ్రేణి జలాంతర్గాముల వల్ల భారత నౌకాదళ పోరాట తీరుతెన్నుల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ‘‘ఇది చాలా సమర్థ ఆయుధ వ్యవస్థ. నీటి అడుగున ఎలాంటి ఆపరేషన్‌ అయినా చేపట్టగలదు. ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట భద్రత పరిస్థితుల్లో భారత ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. శత్రువుల పాలిట సింహస్వప్నంలా నిలుస్తుంది’’ అని తెలిపారు.

*  స్కార్పీన్‌ తరగతి జలాంతర్గాముల సత్తా తిరుగులేనిది. శత్రువు కంటికి చిక్కని రీతిలో స్టెల్త్‌ పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు. ‘వేలా’లో దీర్ఘశ్రేణి గైడెడ్‌ టోర్పిడోలు, నౌకా విధ్వంసక క్షిపణులు ఉంటాయి.

 అధునాతన సోనార్‌, సెన్సర్‌ సాధనాలు దీని సొంతం. చోదక వ్యవస్థలో అత్యంత అధునాతన ‘పర్మనెంట్‌ మ్యాగ్నెటిక్‌ సింక్రనస్‌ మోటార్‌’ కలిగి ఉంది. వేలాలోని ఆధునిక ఆయుధాలు, సెన్సర్లను ‘సబ్‌మెరైన్‌ ఇంటిగ్రేటెడ్‌ కంబాట్‌ సిస్టమ్‌’ (సబ్‌టిక్స్‌) అనే సమగ్ర వ్యవస్థతో అనుసంధానించారు. సాగరాల్లో శత్రు యుద్ధనౌక లేదా జలాంతర్గామిని గుర్తించగానే ఇది ఫ్లయింగ్‌ ఫిష్‌ క్షిపణి లేదా వైర్‌ చోదిత టోర్పిడోలను ప్రయోగించగలదు. దేశీయంగా నిర్మించిన బ్యాటరీలను, ఆధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థను తొలిసారిగా ఇందులో అమర్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని