కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిలిచింది.. ఊపిరి ఆగింది

ప్రధానాంశాలు

కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిలిచింది.. ఊపిరి ఆగింది

గుండె పోటుతో రైతు మృతి

సదాశివనగర్‌, న్యూస్‌టుడే: కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వడ్లను కుప్పలు చేయడానికి వెళ్లిన రైతు గుండెపోటుతో మృతి చెందారు.కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి రాజయ్య (50)   మూడెకరాల్లో వరిని పండించారు. 15 రోజుల కిందట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారు. అప్పటి నుంచి ధాన్యం ఆరబెడుతున్నారు. గురువారం సాయంత్రం వరి కుప్పలు చేయడానికి ఇంటి నుంచి వెళ్లిన రాజయ్య అక్కడే పడిపోయారు. గమనించిన స్థానికులు కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రైతు మృతిపై సొసైటీ సీఈవో భైరయ్యను సంప్రదించగా.. ఈ నెల 15న ధాన్యం వచ్చిందని, తేమ శాతం రాకపోవడంతో కొనుగోలు చేయలేదని తెలిపారు.  


అప్పుల బాధతో రైతు బలవన్మరణం

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఓ కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి, గ్రామ సర్పంచి రాములు తెలిపిన వివరాల ప్రకారం.. మాదారానికి చెందిన వడ్డె రాములు(46) తనకున్న ఒకటిన్నర ఎకరానికి తోడు గత సంవత్సరమే రెండేళ్లకుగాను మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. పోయిన ఏడాది సరైన దిగుబడి రాక పెట్టుబడులకు తెచ్చిన అప్పులు కూడా తీరలేదు. ఈసారి మూడెకరాల్లో మక్క, ఎకరంన్నర పొలంలో పత్తి పంటను సాగుచేశారు. అధిక వర్షాల కారణంగా ఈసారీ పంటలు నష్టపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రెండేళ్లలో బయట తెచ్చిన అప్పులు, బ్యాంకు మిత్తీలు, మహిళా సంఘం ద్వారా తీసుకున్న రుణాలు మొత్తం రూ.4.50 లక్షలకు చేరాయి. వీటిని ఎలా తీర్చాలోనని కొన్ని రోజులుగా తీవ్రంగా మథనపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఎవరూలేని సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని