close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐఐటీ సీటే ఓ కల.. నేరుగా క్లాసుల్లేకుంటే ఎలా..?

 దేశవ్యాప్తంగా 23 సంస్థల్లో ఆన్‌లైన్‌ బోధనే
 ప్రాంగణాల్లో పీహెచ్‌డీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులే
 సుదీర్ఘ ఆన్‌లైన్‌ తరగతులతో విద్యార్థులు ఆగం
 జులై నుంచి తెరచుకోవచ్చంటున్న ఐఐటీ వర్గాలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పాఠశాలలు తెరచుకున్నాయి.. సినిమా థియేటర్లూ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. వ్యాపారాలన్నీ ఎప్పటిలాగే సాగుతున్నాయి.. ఎన్నికలు జరుపుతున్నారు. మరి, ఐఐటీలు మాత్రం ఎందుకు తెరచుకోవు?.. నెలల తరబడి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లకు అతుక్కుపోవాల్సిందేనా?.. ఇవి దేశంలోని వివిధ ఐఐటీల విద్యార్థుల ప్రశ్నలు. ప్రత్యక్ష తరగతులు ఎందుకు ప్రారంభించరంటూ వారు ట్విటర్‌లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఐఐటీ వర్గాలు మాత్రం దశలవారీగా విద్యార్థులను రప్పిస్తున్నామంటున్నాయి. వచ్చే జులై నుంచి పూర్తిస్థాయిలో పిలుస్తామంటున్నాయి.
సొంత ప్రాంగణాన్ని చూసేదెప్పుడు?
దేశంలోని 23 ఐఐటీల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏటా ఒక్క బీటెక్‌లోనే 16వేల మంది ప్రవేశాలు పొందుతుంటారు. వారిలో తెలుగు రాష్ట్రాలవారే 2,500 మంది ఉంటారు. ఈసారి వాటిలో ప్రవేశాల ప్రక్రియ నవంబరు 8తో ముగిసింది. రెండో వారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు మొదలయ్యాయి. ఇప్పటివరకు మూడు నెలలు గడిచాయి. ప్రత్యక్ష తరగతుల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఐఐటీల్లో చదవాలని కలలు కన్న విద్యార్థులు తాము చదివే ప్రాంగణాన్ని అయినా చూడలేకపోయామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘రోజుకు ఆరు గంటలపాటు ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయి....అంతసేపు ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ను చూడటం ఇబ్బందిగా ఉంది’ అని ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న హైదరాబాద్‌ విద్యార్థి ఒకరు విచారం వెలిబుచ్చాడు. మొదటి ఏడాది వారిని మాత్రం హాస్టళ్లలో గదికి ఇద్దరిని ఉంచుతారని, మిగిలిన తరగతుల వారు గదికి ఒకరే ఉంటారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో భౌతిక దూరం సమస్య రాదని, అయినా ప్రత్యక్ష తరగతులను నిర్వహించకుండా ఐఐటీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘మా విద్యాసంస్థ ద్వారా ఐఐటీల్లో సీట్లు సాధించిన పలువురు విద్యార్థులతో ఇటీవల మాట్లాడాను. వారంతా ఆన్‌లైన్‌ తరగతులతో బోర్‌ కొడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు’ అని శ్రీచైతన్య విద్యాసంస్థల ఐఐటీ జాతీయ సమన్వయకర్త ఎం.ఉమాశంకర్‌ తెలిపారు.

పూర్తిస్థాయిలో పరిశోధనా విద్యార్థులకే...

ఇప్పటివరకు పీహెచ్‌డీ విద్యార్థులే పూర్తిస్థాయిలో ప్రాంగణాల్లో ఉన్నారు. పీజీ, యూజీ చివరి ఏడాది విద్యార్థులు దశలవారీగా చేరుకున్నారు. మిగిలిన వారంతా ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమయ్యారు. ఐఐటీ దిల్లీలో మొత్తం 11వేల మంది విద్యార్థులకు కేవలం 1500 మందే ప్రాంగణంలో ఉన్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో 2,900కి 600-700 మందే క్యాంపస్‌లో చదువుకుంటున్నారు. అన్ని ఐఐటీల్లో మొత్తం విద్యార్థుల్లో ప్రాంగణాల్లో ఉన్నది 10-15 శాతమే. దీనిపై ఐఐటీ దిల్లీ సంచాలకుడు ఆచార్య రాంగోపాల్‌రావు మాట్లాడుతూ.. ఐఐటీలన్నీ దశలవారీగా విద్యార్థులను పిలిపిస్తున్నాయని చెప్పారు. తమ సంస్థకు ప్రతి నెలా 500 మందిని రప్పిస్తున్నామన్నారు. ఒకేసారి వేలమందిని రప్పించి.. ఆపై కరోనా ప్రబలితే క్యాంపస్‌ మొత్తం ఖాళీచేయాల్సి వస్తుందనే ఇలా చేస్తున్నామన్నారు. ఇళ్ల వద్ద ల్యాప్‌టాప్‌లు లేవని, అంతర్జాల సమస్య తలెత్తుతోందన్న వారినీ ఐఐటీలకు పిలిపించామన్నారు. వచ్చే జులై నుంచి పూర్తిస్థాయిలో అందరినీ రప్పించాలన్న ఆలోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. మరోవంక.. ‘ల్యాబ్‌లలో పనిచేయాల్సిన వారినే ప్రాంగణాలకు పిలిపించాం’ అని ఐఐటీ హైదరాబాద్‌ వర్గాలు తెలిపాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు