close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొలువు వేటలో కుర్రాళ్లు

  ఉద్యోగార్థుల్లో 64 శాతం మంది పాతికేళ్లలోపు వారే
టీఎస్‌పీఎస్సీ గణాంకాల్లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీలో 64 శాతం పాతికేళ్లలోపు యువత ఉంటోంది. సర్కారీ కొలువుకు ప్రకటన వెలువడిన వెంటనే వేగంగా దరఖాస్తులు చేయడం, చిన్న ఉద్యోగ అవకాశాన్నీ వదులుకోవద్దన్న తరహాలో అత్యధిక సంఖ్యలో పోటీలో నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇప్పటి వరకు చేపట్టిన ఉద్యోగ భర్తీ ప్రక్రియకు దరఖాస్తు చేసిన వారిలో పాతికేళ్లలోపు యవత వాటా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైన తరువాత ఆరేళ్లుగా జరిగిన వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసిన, ఇప్పటికే ఉద్యోగాల కోసం ఉద్యోగార్థులుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారి గణాంకాలను విశ్లేషించి నివేదిక రూపొందించింది. టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్యోగార్థులుగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిలో 64 శాతం మంది పాతికేళ్ల వయసులోపు ఉన్నారు. వీరిలో 18-20 ఏళ్లలోపు 29% మంది ఉన్నట్లు వెల్లడైంది.

30 ఏళ్లు దాటితే పోటీ తక్కువే...
ప్రభుత్వ ఉద్యోగాల పోటీలో 30 ఏళ్లు దాటిన యువత తక్కువే. కుటుంబ బాధ్యతలు మీదపడటంతో ప్రైవేటు, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. కొందరు స్వయం ఉపాధి మార్గాల వైపు వెళ్తున్నారు. ఉద్యోగార్థులుగా ఇప్పటికే నమోదైన 24.62 లక్షల మందిలో 30 ఏళ్లలోపు వయసున్న ఉద్యోగార్థులు 84% మంది ఉంటే.. 30 ఏళ్లు ఆపై దాటిన అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు కేవలం 16 శాతమే ఉంది. 20 ఏళ్లలోపు వయసున్న యువతలో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. 20-25 ఏళ్లలోపు యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం వీరి వాటా 35% ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే వయసు అర్హతను ప్రభుత్వం 44 ఏళ్లకు పెంచినప్పటికీ ఆ వయసులో పోటీపడుతున్న అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంది.

ఎస్సీ, బీసీ వర్గాలు అధికం...
ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్యోగార్థులుగా పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసిన వారిలో 85 శాతం ఆయా వర్గాలకు చెందిన యువత ఉంది. బీసీ-బీ వర్గానికి చెందిన 5.38 లక్షల మంది అభ్యర్థులు అత్యధికంగా పోటీలో ఉన్నారు. ఉద్యోగార్థుల్లో వీరివాటా 22 శాతంగా ఉంది. ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువత రెండోస్థానంలో ఉంది. దాదాపు 20 శాతం యువత (4.96లక్షల మంది) ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తరువాత 19.6 శాతంతో బీసీ-డీ వర్గానికి చెందిన అభ్యర్థులు 4.83 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగార్థులుగా నమోదైన వారిలో ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు 15% (3.79 లక్షలు) మంది ఉన్నారు. గిరిజన అభ్యర్థుల వాటా 9.5 శాతంగా నమోదైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు