close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెరువుల్లో అనకొండలు

  రూ.కోట్ల విలువైన భూముల ఆక్రమణ
  తూములు.. అలుగు, పాటు కాల్వల కబ్జాలు
  చెరువు శిఖంలోనే భారీ భవనాలు, వెంచర్లు
  నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం సూరారం లింగం (కట్టమైసమ్మ) చెరువు విస్తీర్ణం 15.40 ఎకరాలు. దీని కింద పాతిక ఎకరాలకు పైగా ఇనాం భూములు సాగులో ఉండేవి. ఇప్పుడు అవెక్కడా కనిపించవు. చెరువుకున్న రెండు తూములు మూసేసి భవనాలు నిర్మించారు. కట్టపైనే నిర్మాణాలు చేపట్టారు. అలుగు, కాల్వలను మళ్లించారు. దీని కింద నాలుగు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. చెరువు కట్టపై చేపట్టిన నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చేశారు. కట్టపై ఏకంగా పెట్రోల్‌ బంకు నడిపిస్తున్నారు. ఆ పక్కనే చదును చేసి మట్టిపోస్తున్నారు. ఇదే చెరువుకు మరోవైపు బఫర్‌ జోన్‌లోకి వచ్చి ఓ స్థిరాస్తి వ్యాపారి వెంచరు వేస్తున్నారు. ఇప్పటికే మట్టి పోసి రేకులతో కంచె కట్టేసిన అనంతరం అనుమతులకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. చెరువుకట్ట ఆక్రమణకు గురైందని 2018లో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు రెవెన్యూశాఖకు ఫిర్యాదు చేసినా, తెరవెనుక కొందరు పెద్దలు ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. రాజధాని నగరంలోని చెరువుల దుస్థితి ఇది.

ఈనాడు, హైదరాబాద్‌: ‘జల విలయంతో నగరం అతలాకుతలమైనా వారు మారరు... కాలనీలు.. గృహాలు రోజుల తరబడి వరదలో మగ్గినా చలించరు... కట్టలు తెగి ప్రాణాలు పోయినా వారికి పట్టదు. జీవ వైవిధ్యానికి, భూగర్భ జలమట్టానికి ముప్పు వాటిల్లుతున్నా.. పాటు కాల్వలు, తూములు, మత్తడి కట్టలను వారు ఆక్రమిస్తూనే ఉన్నారు. చెరువు భూములను అమాంతం దిగమింగుతున్నారు. చెరువు నీటిమట్టం నిలిచే శిఖం, దాన్ని ఆనుకుని ఉండే ప్రాంతం బఫర్‌ జోన్లలో స్థిరాస్తి వెంచర్లు వేసి భవనాలు కడుతున్నారు. నగరంలో కలిసిపోయి ఉన్న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో భూముల ధరలు రూ.కోట్లలో ఉండడంతో నీటి వనరుల కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన కొందరు అధికారుల చర్యలు కబ్జాదారులకు మద్దతు పలుకుతున్నట్లే కనిపిస్తున్నాయి. కొందరు పెద్దలు, స్థానిక నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. శిఖం భూముల్లో రైతులను ఒప్పించి భూములు కొంటున్నారు. ఈ భూముల్లో పంటలు మాత్రమే వేసుకోవాల్సి ఉన్నా ఏకంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
ఎడాపెడా అనుమతులు
హైదరాబాద్‌-నర్సాపూర్‌ రోడ్డులో ఉన్న రెండు పెద్ద చెరువులను ఆక్రమణదారులు క్రమంగా మింగేస్తున్నారు. పురపాలక శాఖ, డీటీసీపీ, రెవెన్యూ, ఇతర శాఖలు నిబంధనలను గాలికొదిలేసి అనుమతులిచ్చేస్తున్నాయి. చెరువుల్లో హద్దుల గుర్తింపు, హద్దురాళ్లు పాతడం, జియో ట్యాగింగ్‌ చేసి ఆక్రమణలకు కళ్లెం వేసే చర్యలేవీ లేకపోవడం అక్రమార్కులు మరింత ధైర్యాన్నిస్తోంది.
హెచ్చరించినా.. పెడచెవినే..
అయిదు నెలల కిందట సంభవించిన భారీ వరదలకు నగరం అతలాకుతలమైంది. నీటిపారుదల శాఖకు చెందిన 15 బృందాలు 192 చెరువులు, కుంటలను పరిశీలించి వాటిలో సగం ఆక్రమణలకు గురైనట్లు నివేదికలు ఇచ్చాయి. 2000 సంవత్సరంలో వచ్చిన వరదల సమయంలో కిర్లోస్కర్‌ కన్సల్టెన్సీ అధ్యయనం చేసి ఆక్రమణలను ఎత్తిచూపింది. 2017లో నివేదిక ఇచ్చిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ సంస్థ 1978 నాటి పరిస్థితులతో పోల్చి నీటి వనరుల విధ్వంసాన్ని తేల్చి చెప్పింది. ఎన్ని నివేదికలు ఘోషించినా, పాత ఆక్రమణలు పోవు, కొత్తవి ఆగవు.

దుండిగల్‌ శివార్లలోని చిన్నదామర చెరువు రోజురోజుకు కుంచించుకుపోతోంది. చెరువు నీటిమట్టం తగ్గిన తరువాత ఒక్క పంట పండించుకునేందుకు ఇచ్చే ఏక ఫసల్‌ పట్టాలను ఆధారంగా చేసుకుని కొందరు శిఖం భూముల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. 405 సర్వే నంబరులో 78.20 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. వరద వచ్చినప్పుడు తూము తెరిచి దిగువకు వదిలేస్తూ నీటిమట్టం లేకుండా నిర్మాణాలను కాపాడుకుంటున్నారు. బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ దాటి ఆక్రమణలు ఉండటంతో చెరువు సుందరీకరణకు మంజూరైన రూ.కోటి వినియోగం నిలిచిపోయింది.

సూరారం పక్కనే ఉన్న 5.30 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన పెద్ద బందం చెరువు మొత్తం ఆక్రమణల పాలయ్యింది. తూములు, అలుగు నిర్మాణాలను కూల్చివేశారు. గొలుసు చెరువుల నుంచి వచ్చే నీరు దిగువకు వెళ్లకుండా గోడ కట్టేశారు. వెనుక భాగంలో మట్టిపోసి బఫర్‌ జోన్‌ను ఆక్రమిస్తున్నారు. ఈ చెరువుతోపాటు, కట్టమైసమ్మ చెరువు నుంచి దిగువకు వెళ్లే వరద సూరారం పెద్ద చెరువులో కలుస్తుంది. ఈ రెండు చెరువుల దిగువన పది మీటర్ల వెడల్పున పాటు కాల్వ ఉండగా దాన్ని కూడా ఆక్రమించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు