close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్టిజన్ల పదవీ విరమణ వయసు పెంపు

58 నుంచి 61 కు పెంచుతూ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. దీనితోపాటు వారి సర్వీసు నిబంధనల్లో అనేక మార్పులు చేస్తూ విద్యుత్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉన్న 23 వేల మంది ఆర్టిజన్లు  ప్రయోజనం పొందుతారు. విద్యుత్‌సౌధలో మంగళవారం నిర్వహించిన పవర్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో, విద్యుత్‌ యూనియన్ల డిమాండ్లపై ఉన్నతాధికారులు చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు,  జెఎండీ శ్రీనివాస్‌, డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌) అశ్‌క్‌ కుమార్‌లు పాల్గొన్నారు. అనంతరం వివిధ యూనియన్ల ప్రతినిధులతో విడివిడిగా నిర్వహించిన సమావేశాల్లో ఆర్టిజన్ల సర్వీసు రూల్స్‌ విషయంలో చేసిన మార్పులను వివరించారు. అధికారుల నిర్ణయంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తాము ప్రతిపాదించిన ఇతర సమస్యల పరిష్కారానికి రెండు నెలల వ్యవధిలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారని 1104 కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.పద్మారెడ్డి, జి.సాయిబాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మికసంఘం (టీఆర్‌వీకేఎస్‌) తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్‌, ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్‌,  తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 1535 తరఫున సెంట్రల్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎ.వజీర్‌, డి.రాధాకృష్ణ, జెన్‌కో కార్యదర్శి గుర్రం కుమారస్వామి,  తదితరులు పాల్గొన్నారు. కాగా సమావేశానికి తమను ఆహ్వానించలేదని 327, 2871, సీఐటీయూ కార్మిక సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇవీ నిర్ణయాలు

* ప్రమాదంలో మరణించిన ఆర్టిజన్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. గతంలో మరణించిన కుటుంబాలకూ వర్తింపు.
* ఆర్టిజన్లకు పర్సనల్‌ పే మీద డీఏ, హెచ్‌ఆర్‌ఏ. టీఎ బిల్లు పెట్టుకునే సౌలభ్యం.
* గ్రేడ్‌-1 ఆర్టిజన్లకు సెలక్షన్‌ గ్రేడ్‌ ఇచ్చేందుకు అంగీకారం.
* గ్రేడుల వారీగా సీనియారిటీ జాబితా  తయారీ.
* గ్రూపు ఇన్సూరెన్స్‌ వర్తింపు.
* గ్రేడ్‌-4 మహిళా ఆర్టిజన్లకు ప్రసూతి సెలవులు మంజూరు.
* ఒ అండ్‌ ఎం కార్మికులకు ఎఫ్‌.యం గ్రేడ్‌1 నుంచి స్పెషల్‌ గ్రేడ్‌ ఫోర్‌మెన్‌ పదోన్నతి.
* ఎఫ్‌.యం గ్రేడ్‌ 2, గ్రేడ్‌ 4 పోస్టులు మంజూరు.
* ట్రాన్స్‌కోలో అన్ని క్యాడర్లకు సర్కిల్‌ నుంచి సర్కిల్‌కు ఉత్తర్వుల అమలు.
* ఆర్టిజన్లకు, ఒ అండ్‌ ఎం కార్మికులకు ప్రభుత్వ స్కీం ద్వారా మెడికల్‌ స్కీం అమలు.
* బదిలీ అయిన ఆర్టిజన్లకు పదవీవిరమణ  కార్యక్రమం.
* చనిపోయిన ఆర్టిజన్లకు, ఐదు సంవత్సరాలలోపు ఉన్న వారికీ గ్రాట్యుటీ.
* కంపెనీల పరిధిలో అన్ని కేడర్ల ఉద్యోగులకు పరస్పర అంగీకారం ప్రాతిపదికన ట్రాన్స్‌ఫర్లు ఇచ్చేందుకు అంగీకారం.
* భద్రాచలం పవర్‌ ప్లాంటు ఉద్యోగులకు షిఫ్ట్‌ అలవెన్సు, సేఫ్టీ అలవెన్సు ఇచ్చేందుకు అంగీకారం.
* సబ్‌స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఆపరేటర్లకు తోడుగా మరో ఆపరేటర్‌ పోస్టు మంజూరు.
* జెన్‌కో నుంచి ట్రాన్స్‌కోకు బదిలీ అయిన వారికీ సేఫ్టీ అలవెన్స్‌.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు