close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆంధ్రప్రదేశ్‌కు ఆప్మెల్‌... తెలంగాణకు సింగరేణి

 అటార్నీ జనరల్‌ న్యాయసలహా
 దీనిపై మీరేమంటారో చెప్పండి
 తెలుగు రాష్ట్రాల సీఎస్‌లను  కోరిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: సింగరేణి కాలరీస్‌ సంస్థ తెలంగాణకు, దాని అనుబంధ సంస్థ ఆప్మెల్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందాలని అటార్నీ జనరల్‌ న్యాయసలహా ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యలపై బుధవారం దిల్లీ నుంచి రెండు రాష్ట్రాల అధికారులతో అజయ్‌ భల్లా దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, తెలంగాణ నుంచి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు ప్రధానంగా హోంశాఖలో డీఎస్పీలు, అదనపు ఎస్పీలు (సివిల్‌), నాన్‌ కేడర్‌ ఎస్పీలు, షెడ్యూల్‌ తొమ్మిదిలోని సంస్థల ఆస్తులు, అప్పుల విభజన, సింగరేణి కాలరీస్‌ సంస్థకు చెందిన ఆస్తుల విభజన, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం, దిల్లీలోని ఏపీ భవన్‌ విభజన, విద్యుత్తు బకాయిలు వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కేటాయింపులపై మాట్లాడుతూ... తమకు ఐపీఎస్‌ పోస్టులు తక్కువగా ఉన్నందున అదనంగా పదోన్నతి(కన్‌ఫర్డ్‌) పోస్టులు ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు తొమ్మిదో షెడ్యూల్‌లోని ఆస్తుల విభజన జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ కోరారు.
విద్యుత్తు బకాయిలపై చర్చ
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ జెన్‌కో ద్వారా డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్తు బకాయిలు, ఆ రంగానికి సంబంధించిన ఇతర బకాయిలు కలిపి తెలంగాణ రూ.7 వేల కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అయితే... తమ డిస్కంలు ఏపీకి ఒక్క రూపాయి కూడా బాకీలేవని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమకు రూ.2,406 కోట్లు రావలసి ఉందని తెలంగాణ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. రెండువైపుల నుంచీ ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉన్నందున... ట్రైబ్యునల్‌లో ఉన్న కేసును ఏపీ ఉపసంహరించుకుంటే తాము చర్చలకు సిద్ధమన్నారు. ఈ సందర్భంగా భల్లా మాట్లాడుతూ, కాగ్‌ నుంచి వివరాలు తీసుకొని పన్నుల వసూళ్లు, పంపకాల వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నారు. విద్యుత్తు బకాయిల వివాదం అంశాన్ని కూడా రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సింగరేణి, ఆప్మెల్‌ సంస్థలపై అటార్నీ జనరల్‌ నుంచి న్యాయసలహా వచ్చిందన్నారు. దాంతో రెండు రాష్ట్రాల అధికారులు మాట్లాడుతూ, న్యాయ సలహా ప్రతిని తమకు పంపిస్తే చర్చించి, తమ అభిప్రాయాలను తెలియజేస్తామన్నారు. వారి సూచనకు భల్లా అంగీకరించారు. తెలంగాణకు అదనంగా పదోన్నతి ఐఏఎస్‌ పోస్టులు ఇవ్వడానికి సైతం ఆయన ఆమోదం తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు