MLC Eletions: ముగ్గురు తెరాస అభ్యర్థుల ఏకగ్రీవం!

ప్రధానాంశాలు

MLC Eletions: ముగ్గురు తెరాస అభ్యర్థుల ఏకగ్రీవం!

కల్వకుంట్ల కవిత, శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డిల ఎన్నిక లాంఛనమే  
ఏడు జిల్లాల్లో 71 మంది ‘స్థానిక ఎమ్మెల్సీ నామినేషన్ల’కు ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుధవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సాంకేతిక తప్పిదాల కారణంగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా చోట్ల తెరాస అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డిల ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. మరోవైపు మిగిలిన ఏడు జిల్లాల్లో పరిశీలన అనంతరం 71 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఈ నెల 26 వరకు ఉపసంహరణకు గడవు ఉంది. అనంతరం ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో డిసెంబర్‌ 10న పోలింగ్‌ జరుగుతుంది. 14న ఓట్లు లెక్కించి ఫలితాల్ని వెల్లడిస్తారు.  

26న ఆ ముగ్గురికి ధ్రువీకరణ పత్రాలు..

నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం తెరాస అభ్యర్థి కవిత నామినేషన్‌ వేయగా.. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్‌ సైతం దాఖలు చేశారు. ఆయన సరైన ఫార్మాట్‌లో అఫిడవిట్‌ ఇవ్వకపోవడంతో నామినేషన్‌ తిరస్కరణకు గురైనట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ.. ఆయనను బలపరిచినట్లు పేర్లున్న ఎంపీటీసీ సభ్యులు నవనీత, మనోహర్‌, కార్పొరేటర్‌ రజియా సుల్తానా సైతం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

రంగారెడ్డి జిల్లాలో శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డిలతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ వేసినా ఆయనకు మద్దతుగా ఎవరూ సంతకాలు చేయకపోవడంతో దాన్ని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన ఈ నెల 26న కవిత, శంభీపూర్‌ రాజు, మహేందర్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. తెరాస అధిష్ఠానం ఆదేశాల మేరకు.. ఏడు జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు శిబిరాలకు తరలివెళ్లారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ప్రత్యర్థులు ఉన్నచోట.. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని తెరాస ఆదేశించింది.


మహబూబ్‌నగర్‌ తెరాస అభ్యర్థుల ఆస్తుల వివరాలు..

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస తరఫున నామినేషన్లు వేసిన సిట్టింగులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరిచారు.
కసిరెడ్డి నారాయణరెడ్డి : (భార్య మాధవిరెడ్డి పేరిట ఉన్నవి కలిపి) చరాస్తులు : రూ.13,00,88,841 ; స్థిరాస్తులు (మార్కెట్‌ విలువ) : రూ.23,73,82,520 ;  అప్పులు : రూ.1,75,02,766.  
కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి : చరాస్తులు : రూ.1,20,19,712 ; స్థిరాస్తులు (మార్కెట్‌ విలువ) : రూ.2,51,00,000.


ఆ ఫిర్యాదుపై తక్షణం నివేదిక ఇవ్వండి:  శశాంక్‌ గోయల్‌

రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు చింపుల శైలజ ఫిర్యాదుపై గురువారం ఉదయంలోగా నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ను ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో పోటీకి నామినేషన్‌ వేసేందుకు వచ్చిన తన నుంచి తెరాస నాయకులు పత్రాలు లాక్కుని చించివేశారని శైలజ, రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి గోయల్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని