Pocharam Srinivas Reddy: సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా

ప్రధానాంశాలు

Pocharam Srinivas Reddy: సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా

ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా సోకింది. ఆరోగ్య పరీక్షల్లో భాగంగా బుధవారం రాత్రి చేసుకున్న కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా వైద్యుల సూచనల మేరకు ముందు జాగ్రత్తగా గురువారం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్‌ కోరారు. ఈ నెల 21న పోచారం మనవరాలి వివాహం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌లతో పాటు పలువురు రాజకీయ, అధికార ప్రముఖులు హాజరయ్యారు. వారందరినీ కలిసిన పోచారం.. పెళ్లి హడావిడి ముగిసిన అనంతరం తనతోపాటు కుటుంబసభ్యులు, సిబ్బందికి వైద్యపరీక్షలు చేయించారు. అందులో పోచారానికి కొవిడ్‌ నిర్ధారణ కాగా మిగిలిన వారెవరికీ సోకలేదు. పోచారం ఇప్పటికే రెండు కరోనా టీకా డోస్‌లు తీసుకున్నా తాజాగా వైరస్‌ సోకింది. కాగా సభాపతి ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ వాకబు చేశారు.

కొత్తగా 147 కేసులు
రాష్ట్రంలో కొత్తగా 147 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 6,75,148కి పెరిగింది. మహమ్మారి బారినపడి మరొకరు కన్నుమూయగా ఇప్పటి వరకూ 3,986 మంది మృతిచెందారు. కరోనా బారిన పడి చికిత్స పొందిన అనంతరం తాజాగా 148 మంది కోలుకోగా మొత్తంగా 6,67,631 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 25న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,531 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33,836 నమూనాలను పరీక్షించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,84,17,448కి చేరింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 56 కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 12, కరీంనగర్‌లో 11 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 10 కంటే తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 1,82,106 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు. మొత్తంగా ఇప్పటి వరకూ 2,45,34,315 మంది తొలిడోసును, 1,22,65,259 మంది రెండోడోసును స్వీకరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని