China Marathon: 21 మంది రన్నర్లు మృతి!

తాజా వార్తలు

Published : 23/05/2021 19:26 IST

China Marathon: 21 మంది రన్నర్లు మృతి!

ప్రతికూల వాతావరణంతో మారథాన్‌లో విషాదం

బీజింగ్‌: చైనాలో నిర్వహించిన మారథాన్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా 100 కి.మీ మౌంటెన్‌ రేసులో పాల్గొన్న వారిలో 21 మంది మృతి చెందారు. ఈ మారథాన్‌లో మొత్తం 172 మంది పాల్గొనగా.. వారిలో 151 మంది సురక్షితంగా బయటపడినట్లు చైనా మీడియా వెల్లడించింది.

చైనాలో గాన్సు ప్రావిన్సుకు చెందిన బయిన్‌ నగరంలోని ఓ పర్యాటక ప్రదేశంలో 100కి.మీ పర్వత మారథాన్‌ ఏర్పాటు చేశారు. ఈ మారథాన్‌ సాగే ప్రాంతం మొత్తం దాదాపు యెల్లో నదీ తీర అటవీ ప్రాంతంలోనే ఉంది. ఈ పరుగులో పాల్గొన్న రన్నర్లకు 20 నుంచి 31కి.మీ మధ్యకు చేరుకున్న అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఎదురైంది. ఒక్కసారిగా వడగళ్లు, మంచు వర్షం, భీకర చలిగాలులు రావడంతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో రేసులో పాల్గొన్న రన్నర్లలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సహాయం కోసం వెంటనే కొందరు రన్నర్లు సమీప రెస్క్యూ కేంద్రాలకు తెలియజేశారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని పలువురి రక్షించినప్పటికీ.. అప్పటికే దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బయిన్‌ నగర మేయర్‌ ఝాంగ్‌ షూచెన్‌ పేర్కొన్నారు. మరో ఎనిమిది స్వల్ప అస్వస్థతతో కోలుకుంటున్నారని తెలిపారు. ఈ మారథాన్‌ నిర్వాహకుడిగా క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించిన మేయర్‌, మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

పర్వతాలతో కూడుకున్న యెల్లో రివర్‌ స్టోన్‌ అటవీ ప్రాంతం గాన్సు ప్రావిన్సులో ఓ పర్యాటక కేంద్రంగా ఉంది. చైనా టెలివిజన్‌ షోలు, సినిమా చిత్రీకరణ ఎక్కువగా సాగే ఈ ప్రావిన్సును గతంలో వరదలు ముంచెత్తాయి. ఇక భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే బయిన్‌ గనరంలో 2010లో నగరంలో వచ్చిన వరదల ధాటికి వెయ్యి మంది చనిపోయినట్లు చైనా మీడియా పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని