
తాజా వార్తలు
హాస్టల్లో 39మంది విద్యార్థులకు కరోనా
లాతూర్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా లాతూర్ నగరంలోని ఓ హాస్టల్లో 39మంది విద్యార్థులు, ఐదుగురు ఉద్యోగులకు వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. వసతిగృహంలో ఉండే 360 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించగా.. వారిలో 39మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యశాఖ అధికారి మహేశ్ పాటిల్ వెల్లడించారు. వైరస్ బారిన పడిన విద్యార్థులందరూ తొమ్మిది, పదో తరగతికి చెందినవారేనన్నారు.
ఈ వసతి గృహంలో 60మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని, వీరిలో 30మందిని కొవిడ్ పరీక్షలకు పంపగా.. ఐదుగురిలో వైరస్ లక్షణాలు బయటపడ్డాయని చెప్పారు. ఇంకా కొందరి నివేదికలు రావాల్సి ఉందని చెప్పారు. హాస్టల్లో ఓ బాలికకు కొవిడ్ సోకగా.. ఆమెతో పాటు గదిలో కలిసి ఉండే 13మందికి వైరస్ సోకడంతో కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు. వైరస్ సోకిన విద్యార్థులు, ఉద్యోగులందరినీ నగర సమీపంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో క్వారంటైన్లో ఉంచినట్టు తెలిపారు.
మరోవైపు, మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో కొత్తగా 6218 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి.