కరోనా కేసులు.. 70 జిల్లాల్లో 150% పెరిగాయ్‌!

తాజా వార్తలు

Updated : 17/03/2021 19:35 IST

కరోనా కేసులు.. 70 జిల్లాల్లో 150% పెరిగాయ్‌!

15 రోజుల్లోనే నమోదైనట్టు కేంద్రం వెల్లడి

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేస్తోంది. మార్చి 1 నుంచి 15 వరకు దేశంలో 16 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో 150%కన్నా ఎక్కువ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో మహారాష్ట్రలోనే ఎక్కువ జిల్లాలు ఉండటం గమనార్హం. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణపై కేంద్రం కలవరం చెందుతోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసుల్లో దాదాపు 60శాతం ఇక్కడే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 60శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ప్రస్తుత కరోనా మరణాల్లో 45.4శాతం మరణాలు ఇక్కడే నమోదు కావడం ఆందోళనకరం. మార్చి 1నాటికి ఇక్కడ 11శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ఇప్పుడు 16శాతానికి పెరిగింది. మహారాష్ట్రలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ పరీక్షలు తక్కువగానే జరుగుతున్నాయి. టెస్ట్‌లు మరింతగా పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించాం’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.

కరోనా వైరస్‌ మరోసారి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసేందుకు టెస్టింగ్‌, ట్రేసింగ్‌‌, ట్రీటింగ్‌ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలను రాజేశ్‌ భూషణ్‌ కోరారు. అన్ని జిల్లాల్లో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు కనీసం 70శాతంగా నిర్వహించాలని సూచించారు. కరోనా రోగులతో దగ్గరగా మెలిగిన వారిని 72 గంటల్లోనే గుర్తించడం, ఐసోలేట్‌ చేయడం, వారికి పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలు సత్వరమే చేపట్టాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడంపైనా పలు సూచనలు చేశారు. దీనికితోడు ప్రజలు మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను శుభ్రపరుచుకోవడంపై విస్తృత అవగాహన కల్పించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే టీకా వృథా అధికం!

ఇప్పటివరకు రాష్ట్రాలకు 7.54కోట్ల టీకా డోసులను అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. టీకా వృథాను నివారించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని కోరారు. తెలంగాణ, ఏపీ, యూపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో టీకా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ వ్యాప్తంగా టీకా వృథాశాతం 6.5శాతం ఉండగా.. తెలంగాణలో అత్యధికంగా 17.6శాతం ఉన్నట్టు నీతిఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడించారు. ఇది ఏపీలో 11.6శాతం, యూపీలో 9.4శాతం, కర్ణాటకలో 6.9, జమ్మూకశ్మీర్‌లో 6.6శాతంగా ఉన్నట్టు వివరించారు. వృథాను తగ్గించుకోవడంపై  దృష్టిసారించాలని ఆయా రాష్ట్రాలను కోరినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయంలో బాధపడ్డారన్నారు. మరోవైపు, ఈ రోజు ఉదయం 9గంటల వరకు దేశ వ్యాప్తంగా 3.51కోట్ల మందికి టీకా పంపిణీ జరిగినట్టు అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని