Vaccination: టీకా పంపిణీలో భారత్‌ జోరు.. 11 రోజుల్లోనే 10 కోట్ల డోసులు

తాజా వార్తలు

Published : 18/09/2021 22:50 IST

Vaccination: టీకా పంపిణీలో భారత్‌ జోరు.. 11 రోజుల్లోనే 10 కోట్ల డోసులు

మొత్తం 80 కోట్లు దాటిన డోసుల సంఖ్య

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భారత్‌ దూసుకుపోతోంది. శనివారానికి దేశవ్యాప్తంగా మొత్తం 80 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించగా.. మొదటి పది కోట్ల డోసుల మార్క్‌ చేరుకునేందుకు 85 రోజుల సమయం పట్టింది. తాజాగా 70 కోట్ల నుంచి 80 కోట్లకు చేరుకునేందుకు కేవలం 11 రోజులు మాత్రమే పట్టడం విశేషం. ఈ మహత్తర ఘనత సాధించినందుకు దేశానికి అభినందనలు అని మంత్రి పేర్కొన్నారు. కొవిడ్‌కు అందనంత ఎత్తులో నిలుస్తున్నామని రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా, టీకా పంపిణీలో భారత్‌ శుక్రవారం సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రెండున్నర కోట్లకుపైగా డోసులు పంపిణీ చేశారు. దీన్ని ప్రపంచ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా మాండవీయ అభివర్ణించారు. ప్రధాని సైతం హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే, ఆగస్టు 6 నాటికి దేశవ్యాప్తంగా డోసుల సంఖ్య 50 కోట్లు దాటగా, సెప్టెంబరు 13 నాటికి 75 కోట్లు దాటింది. వచ్చే నెల నాటికి 100 కోట్ల డోసులను పంపిణీ చేయాలని ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.




Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని