86శాతం కేసులు ఆరు రాష్ట్రాల నుంచే..!

తాజా వార్తలు

Published : 08/03/2021 16:33 IST

86శాతం కేసులు ఆరు రాష్ట్రాల నుంచే..!

వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు జన్యు మార్పిడి చెందుతున్న వైరస్‌ ప్రజల్ని కలవరానికి గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో 18,599 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదవుతున్న కేసుల్లో 86.25 శాతం కేసులు ఆరు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ శాతం కేసులను నమోదు చేస్తున్నాయి. మరోవైపు గడచిన 24 గంటల్లో 18 రాష్ట్రాల్లో కరోనా మరణాలు సంభవించకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. నిన్న నమోదైన మరణాల్లో 88శాతం ఏడు రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

18 రాష్ట్రాల్లో సున్నా మరణాలు..

గడచిన 24 గంటల్లో దేశంలో 97 మరణాలు సంభవించాయి. వాటిల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 38 మరణాలు సంభవించగా, పంజాబ్‌ (17), కేరళ (13) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు 18 రాష్ట్రాల్లో కరోనా మరణాల సంఖ్య సున్నాకే పరిమితమైంది. అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, చండీగఢ్‌, డయ్యూ డామన్‌- దాద్రానగర్‌ హవేలీ, గోవా, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, లద్దాఖ్‌, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్‌, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో కరోనాతో ఎవరూ మరణించలేదని కేంద్రం తెలిపింది.

22 కోట్లకు పైగా కరోనా టెస్టులు..

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 22,19,68,271 కోట్ల కరోనా టెస్టులు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,88,747 గా ఉంది. క్రియాశీల కేసుల రేటు 1.68గా ఉంది. నిన్న నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 11,141 కేసులు నమోదవ్వగా, కేరళ (2,100), పంజాబ్‌ (1,043) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలతో కేంద్రం ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు, ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య బృందాలను పంపింది.

2.09 కోట్ల మందికి టీకా..

మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరాంటంకంగా సాగుతోంది. మార్చి 1 నుంచి రెండో దశ పంపిణీ కూడా ప్రారంభించడంతో పంపిణీ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 2.09,89,010 కోట్ల మందికి టీకాలు అందిచారు. 1,72,27,903 కోట్ల మందికి వ్యాక్సిన్‌ మొదటి డోసు అందించగా, 37,61,107 లక్షల మందికి రెండో డోసు అందించినట్లు కేంద్రం తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని