
తాజా వార్తలు
మొదట భారత్‌లోనే కొవిషీల్డ్ పంపిణీ
పుణె: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కరోనా టీకా మొదట భారత్‌లోనే పంపిణీ చేస్తామని ఆ సంస్థ సీఈవో అధార్ పునావాలా వెల్లడించారు. భారత్‌లో పంపిణీ చేసిన తర్వాతే కోవాక్స్ దేశాలకు సరఫరా చేస్తామని అన్నారు. ప్రధాని మోదీ శనివారం సీరమ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించిన అనంతరం పునావాలా మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ సీరం ఇన్స్టిట్యూట్ సందర్శన సందర్భంగా ఆయనతో వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి పలు విషయాలు చర్చించాం. టీకా ప్రయోజనాలు, ప్రభావం గురించి ప్రధానికి వివరించాం. సీరమ్ ఇన్స్టిట్యూట్ సౌకర్యాలపై ప్రధాని ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం కొవిషీల్డ్ టీకా ఉపయోగానికి సంబంధించి అత్యవసర లైసెన్స్ కోసం డ్రగ్ కంట్రోలర్‌కు దరఖాస్తు చేసుకునేందుకు పని ప్రారంభించాం. రెండు వారాల్లో టీకాకు సంబంధించిన డేటాను డ్రగ్ కంట్రోలర్‌కు సమర్పించి అత్యవసర లైసెన్స్‌కు దరఖాస్తు చేస్తాం. టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే ముందు భారత్‌లోనే పంపిణీ చేస్తాం. ఆ తర్వాతే కోవాక్స్ దేశాలకు సరఫరా చేస్తాం’’ అన్నారు.
‘‘యూకే, యూరోపియన్ మార్కెట్లు సైతం ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఉన్నాయి. కానీ మా మొదటి ప్రాధాన్యత భారత్ ఆ తర్వాత కోవాక్స్ దేశాలే. జనవరి, ఫిబ్రవరి కల్లా తొలి విడతగా 10-15 మిలియన్ల డోసులు, ఏప్రిల్, మే కల్లా 100 మిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తాం. కానీ ఆరోగ్య శాఖ జూన్-జులై కల్లా 300-400 మిలియన్ డోసులు కావాలని సూచనలు ఇస్తోంది. అదే లక్ష్యంగా మేం పని చేస్తున్నాం’ అని పునావాలా వివరించారు. కరోనా వ్యాక్సిన్ అన్ని దేశాలకు సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ‘కోవాక్స్’ ఏర్పడింది. ఇందులో పేద, మధ్య ఆదాయ దేశాలే కాకుండా.. ధనిక దేశాలూ ఉన్నాయి.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. భారత్‌లో వీటిని ఉత్పత్తి చేయడంతో పాటు క్లినికల్ ట్రయల్స్‌ను కూడా సీరమ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తోంది. కాగా శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోన్న సంస్థలను సందర్శనలో భాగంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలతో చర్చించారు.