
తాజా వార్తలు
కరోనా టీకా కోసం ఉపముఖ్యమంత్రి పూజలు
దిల్లీ: కరోనా వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రపంచం టీకా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టీకా త్వరగా అందుబాటులోకి రావాలని, కొవిడ్-19 లేని ప్రపంచం కోసం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గురువారం పూజలు చేశారు.
‘కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మా పరిస్థితి కూడా అలాగే ఉంది. త్వరగా టీకా అందుబాటులోకి వస్తే..ఈ ప్రపంచం వ్యాధి నుంచి విముక్తి పొందుతుంది’ అని సోలాపూర్ జిల్లాలోని భగవాన్ విఠల్ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పవార్ మీడియాతో మాట్లాడారు. కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో కొవిడ్-19 పరిస్థితులు అదుపులో ఉన్నట్లే కనిపించాయని, కానీ, గత కొద్ది రోజులుగా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభానికి దేవుడు ముగింపు పలుకుతాడని, అయితే, ప్రజలు మాత్రం మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి చర్యలు పాటించాలని అభ్యర్థించారు. కాగా, మహారాష్ట్ర కరోనా వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటివరకు అక్కడ 17,95,959 మంది వైరస్ బారిన పడ్డారు. బుధవారం ఒక్కరోజే 6,159 కేసులు వెలుగుచూశాయి.