కరోనా కట్టడిలో ట్రంప్‌ విఫలమయ్యారు..

తాజా వార్తలు

Published : 22/07/2020 02:27 IST

కరోనా కట్టడిలో ట్రంప్‌ విఫలమయ్యారు..

పెదవి విరుస్తున్న అమెరికన్లు 
ఈసారి కష్టమే అంటున్న సర్వేలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి ఎన్నిక కావటం ఎంతవరకు సాధ్యం అనే ప్రశ్నకు... కష్టమేనని సర్వే సంస్థల ఫలితాలు జవాబిస్తున్నాయి. ఈ మేరకు వాషింగ్టన్‌ పోస్ట్‌, ఏబీసీ న్యూస్‌ నిర్వహించిన ఇటీవలి సర్వేలో తన ప్రధాన ప్రత్యర్థి జో బైడెన్‌తో పోలిస్తే ట్రంప్‌నకు తక్కువ మంది మద్దతిస్తున్నారని వెల్లడయింది. కరోనా వైరస్‌ కట్టడిలో ట్రంప్‌ విఫలమయ్యారని ఎక్కువమంది అమెరికన్లు భావిస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది. దీనితో ట్రంప్‌ తన మద్దతుదారులనే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. 

ఈ నెల 12 నుంచి 15 వరకు వివిధ అంశాల వారీగా ఈ సర్వేను నిర్వహించారు. కాగా, దీనిలో ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయి. కొవిడ్‌ కట్టడిలో ట్రంప్‌ కన్నా బైడెన్‌ మెరుగ్గా వ్యవహరిస్తారని భావిస్తున్నట్టు 54 శాతం అమెరికన్లు తెలిపారు. కేవలం 34 శాతం మంది మాత్రమే ట్రంప్‌ పనితీరు బాగున్నట్టు పేర్కొన్నారు. భద్రత, జాతి వివక్ష, దేశాన్ని ఏకం చేయటం, ప్రజల సమస్యలకు అర్థం చేసుకోవటం, నిజాయితీ, నమ్మకం, వ్యక్తిగత విలువలు కలిగి ఉండటం తదితర అంశాల్లో కూడా బైడెన్‌, ట్రంప్‌ కన్నా మెరుగ్గా ఉన్నట్టు అమెరికన్లు అభిప్రాయపడ్డారు. ఆర్థిక రంగ నిర్వహణ అంశంలో కూడా ట్రంప్‌తో బైడెన్‌ సరిసమానంగానే ఉన్నట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. 

ఈ గణాంకాల ప్రకారం ట్రంప్‌నకు 40శాతం, బైడెన్‌కు 55 శాతం మద్దతు లభించింది. మార్చిలో  ట్రంప్‌పై రెండు పాయింట్లు మెరుగ్గా ఉన్న బైడెన్‌, మే నాటికి 10 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు 61 శాతం మంది ప్రజలు ట్రంప్‌ దేశాన్ని ఏకం చేయటానికి బదులు విభజించారని అభిప్రాయపడ్డారు. సర్వే ఫలితాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడు ఎవరయ్యేదీ కూడా కరోనాయే నిర్ణయించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని