ప్లాస్మా ఎప్పుడు సేకరించాలి?

తాజా వార్తలు

Published : 04/10/2020 10:06 IST

ప్లాస్మా ఎప్పుడు సేకరించాలి?

ఎక్కువరోజులైతే యాంటీబాడీలు ఉండవా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి మెడలు వంచే చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు రకాల ఔషధాలు అత్యవసర వినియోగం కింద ఉపయోగిస్తున్నారు. మరికొన్నింటి సమర్థతపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్లాస్మా చికిత్సా విధానం ఇప్పటి వరకు బహుళ ప్రాచుర్యం పొందింది. కరోనా తీవ్రరూపం దాల్చిన వారిలో ఇది మెరుగైన ఫలితాలిస్తోందని తొలుత అందరూ భావించారు. కానీ, దీని వల్ల పెద్దగా మరణాల రేటు తగ్గినట్లు ఆధారాలేమీ లేవని ఐసీఎంఆర్‌ కుండబద్దలు కొట్టింది. దీంతో ఈ చికిత్సా విధానం సమర్థతపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చింది. 

యాంటీబాడీలు శాశ్వతం కాదా?

వైరస్‌ శరీరంలోకి ప్రవేశించగానే దాంతో పోరాడేందుకు మన రోగనిరోధక శక్తి ప్రతిరక్షకాల(యాంటీబాడీల)ను విడుదల చేస్తుంది. ఇవి శరీరంలో కొన్ని నెలల పాటు.. మరికొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి. ప్లాస్మా చికిత్సలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి యాంటీబాడీలను సేకరించి బాధిత వ్యక్తికి అందిస్తారు. అవి శరీరంలో సహజంగా ప్రతిరక్షకాలు విడుదలవడానికి ముందే రోగనిరోధక వ్యవస్థను మేల్కొలిపి వైరస్‌తో పోరాడుతాయి. దీంతో వ్యాధి తీవ్రత భారీగా తగ్గుతుంది. అయితే, దాతల నుంచి ఈ యాంటీబాడీలను ఎప్పుడు సేకరించాలన్నది ఇక్కడ కీలకాంశం అని పరిశోధకులు అంటున్నారు. కోలుకున్న తర్వాత వీలైనంత త్వరగా ప్లాస్మాను సేకరిస్తేనే మేలని చెబుతున్నారు. కరోనా వైరస్‌తో పోరాడేందుకు శరీరంలో జనిస్తున్న యాంటీబాడీలు శాశ్వతం కాదని తమ పరిశోధనలో తేలినట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన రెనీ బజిన్‌ తెలిపారు. 

ఎప్పటి నుంచి తగ్గిపోతాయి?

అధ్యయనంలో భాగంగా కొవిడ్‌-19 నుంచి కోలుకున్న 282 మంది నుంచి వివిధ సమయాల్లో ప్లాస్మాను సేకరించారు. వీరందరిలో వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉండింది. ఎవరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాలేదు. వీరి నుంచి నాలుగు నుంచి తొమ్మిది సార్లు ప్లాస్మాను సేకరించారు. లక్షణాలు కనిపించిన 33వ రోజు నుంచి 77వ రోజు మధ్య తొలిసారి.. 66వ రోజు నుంచి 114వ రోజు మధ్య చివరిసారి ప్లాస్మాను సేకరించారు. తొలుత సీరోపాజిటివ్‌గా తేలిన వ్యక్తులు కొన్ని నెలల్లోనే సీరోనెగెటివ్‌గా మారినట్లు ఈ అధ్యయనంలో గుర్తించామని బజిన్‌ తెలిపారు. అంటే ప్రతిరక్షకాలు కనుమరుగైపోయాయి. ఎన్నిసార్లు ప్లాస్మాను సేకరించామన్న దానితో సంబంధం లేకుండా యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని తేలిందన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ వాటంతట అవే సహజంగా కనుమరుగైపోతున్నట్లు గుర్తించామన్నారు. 15 మందిలో సుమారు 88వ రోజు నుంచి యాంటీబాడీల తగ్గుదల నమోదైనట్లు తేలిందన్నారు. అక్కడి నుంచి 21రోజు లోపు సగానికిపైగా ప్రతిరక్షకాలు తగ్గిపోయినట్లు గుర్తించామన్నారు. అంటే లక్షణాలు కనిపించిన 110వ రోజు నాటికి సగానికిపైగా యాంటీబాడీలు శరీరంలో కనుమరుగైపోతున్నాయి! ఈ నేపథ్యంలో ప్లాస్మా దానం చేయడానికి వైద్యులు అనుమతించిన తర్వాత వీలైనంత త్వరగా ఆ పని చేయాలని బజిన్‌ సూచిస్తున్నారు.

తగ్గుదలకు కారణమేంటి?

ప్రతిరక్షకాలు తగ్గిపోవడానికి గల కారణాలపై పరిశోధకులు దృష్టి సారించారు. దీన్ని అర్థం చేసుకోవడానికి వైరస్‌ కణంలోకి ప్రవేశించే రిసెప్టర్‌ బైండింగ్‌ డొమైన్‌(ఆర్‌బీడీ) అనే వ్యవస్థపై అధ్యయనం చేస్తున్నారు. ఆర్‌బీడీ అనేది వైరస్‌పై ఉండే ఒక ప్రోటీన్‌. ఇది కణం ఉపరితలంపై ఉండే ఏసీఈ-2 రిసెప్టార్‌కు అతుక్కుని అక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఆర్‌బీడీ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. వైరస్‌ శరీరంలోని కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఈ ప్రక్రియను మరింత లోతుగా అధ్యయనం చేయడం వల్ల యాంటీబాడీలు కనుమరుగైపోవడానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

తాజా అధ్యయనం ఉపయోగాలు..

యాంటీబాడీల తగ్గుదలపై అధ్యయనం చేయడం వల్ల ప్లాస్మా చికిత్స విధివిధానాలను సమర్థంగా రూపొందించే అవకాశం ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. సీరో సర్వే నిర్వహణ, వ్యాక్సిన్‌ అభివృద్ధికి కూడా ఈ ఫలితాలు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే ఏ రకమైన ప్లాస్మా ఎంచుకోవాలన్నదానిపై ఇప్పటికీ ఇంకా స్పష్టత లేదు. దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కూడా ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని