close

తాజా వార్తలు

Updated : 27/11/2020 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై అదనపు పరీక్షలు..!

టీకా డోసులపై సందేహాల నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా యోచన

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా భిన్న డోసుల మధ్య సమర్థత విషయంలో వైరుధ్యం తలెత్తడంతో నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా సమర్థతను తేల్చేందుకు మరోసారి ప్రయోగాలు జరపాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో పాస్కల్‌ సోరియట్‌ తెలిపారు. అయితే, ఇప్పటికే జరుగుతున్న ప్రయోగాలకు.. ఇవి అదనం అని స్పష్టం చేశారు. తక్కువ డోసు తీసుకున్నవారిలో ఎక్కువ పనితీరు కనబర్చడంతో ప్రయోగాలు ఆ కోణంలోనే సాగనున్నాయని తెలిపారు. ఈసారి ప్రయోగాలు వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. సామర్థ్యం ఎక్కువగా ఉందని ముందే తెలిసిన నేపథ్యంలో తక్కువ మందిపై ప్రయోగిస్తే సరిపోతుందన్నారు.

కొత్తగా జరపబోయే ప్రయోగాల వల్ల టీకా అత్యవసర వినియోగానికి అనుమతించేందుకు ఐరోపా సమాఖ్య(ఈయూ), యూకే జాప్యం చేస్తాయని తాను భావించడం లేదని సోరియట్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికాలో వ్యాక్సిన్ అనుమతికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఇతర ప్రాంతాల్లో జరిపిన ప్రయోగాల సమాచారం ఆధారంగా అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులిచ్చేందుకు సుముఖంగా లేదని తెలిపారు. మరికొన్ని దేశాల్లో డిసెంబరు చివరి నాటికి అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు. 

రెండు రకాల డోసుల్లో టీకాను పరీక్షించామని ఆస్ట్రాజెనెకా ప్రాథమిక ఫలితాల ప్రకటనలో వెల్లడించింది. ఒక విధానంలో ప్రామాణిక డోసులో సగం మేర ఇచ్చామని.. నెల తర్వాత రెండో డోసును పూర్తిస్థాయిలో ఇచ్చామని తెలిపింది. వీరిలో 90 శాతం రక్షణ లభించిందని వెల్లడించింది. అయితే, సగం ఇవ్వాలన్నది తమ ప్రయోగాల్లో భాగం కాదని.. పొరపాటున అలా జరిగిందని తెలిపింది. దీంతో శాస్త్రవేత్తలు, పరిశోధకుల నుంచి సందేహాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు రెండో విధానంలో నెల వ్యవధిలో రెండు పూర్తిస్థాయి డోసులు ఇవ్వగా 62 శాతం రక్షణ లభించినట్లు తెలిపింది. పైగా ఈ వైరుధ్యానికి కారణాలు తమకు తెలియదని చెప్పింది. దీంతో భిన్న డోసుల మధ్య వైరుధ్యం ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

ఆరా తీసిన బ్రిటన్‌ ప్రభుత్వం...

టీకా సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతుండడంపై యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రభుత్వం సైతం స్పందించింది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను వినియోగానికి అనుమతించాలో.. లేదో.. క్షుణ్నంగా సమీక్షించాలని ‘మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్‌ఆర్ఏ)ని హెల్త్‌ సెక్రటరీ మ్యాట్‌ హాన్‌కాక్‌ కోరారు. వ్యాక్సిన్‌ రక్షణ స్థాయి భద్రతా ప్రమాణాలకు లోబడి ఉందో.. లేదో.. చూడాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంహెచ్‌ఆర్ఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పూర్తి స్థాయి సమీక్ష తర్వాతే అనుమతికి ప్రతిపాదిస్తామని తెలిపారు. దీనికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే 100 మిలియన్‌ ఆక్స్‌ఫర్డ్‌ డోసులకు ఆర్డర్‌ ఇచ్చింది. డిసెంబరులో పంపిణీకి ప్రణాళికలు కూడా పూర్తి చేసింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన