ట్రంప్‌ హాజరైన సమావేశంలో వ్యక్తికి కరోనా!

తాజా వార్తలు

Updated : 08/03/2020 09:58 IST

ట్రంప్‌ హాజరైన సమావేశంలో వ్యక్తికి కరోనా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో ఇటీవల జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఓ వ్యక్తికి కరోనా వైరస్‌(కొవిడ్‌-19) సోకినట్లు నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కూడా పాల్గొనడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే బాధితుడు ట్రంప్‌తో కానీ, పెన్స్‌తో కానీ నేరుగా కలవలేదని అధికారులు తెలిపారు. అలాగే మెయిన్‌ హాల్‌లో జరిగిన కీలక సమావేశానికి సైతం ఆయన హాజరు కాలేదని వెల్లడించారు. ఫిబ్రవరి చివరి వారంలో మేరీల్యాండ్‌లో ‘ది కన్జర్వేటివ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కాన్ఫరెన్స్‌(సీపీఏసీ)’ సమావేశం జరిగింది. దీంట్లో క్యాబినెట్‌ సభ్యులతో సహా శ్వేతసౌధానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు వైరస్‌ లక్షణాలు ఉన్న ఎవరైనా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

> మరోవైపు అమెరికాలో మరణాల సంఖ్య 19కి చేరింది. న్యూయార్క్‌లో వైరస్‌ బాధితుల సంఖ్య 89 చేరడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్రరాజ్యంలో దాదాపు సంగంపైగా రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాలిఫోర్నియా తీరంలో ఆగిన గ్రాండ్‌ ప్రిన్స్‌ నౌకను ఇంకా అక్కడే నిలిపి ఉంచారు.

> చైనాలో మరో 27 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. దీంతో మృతుల సంఖ్య 3,097కు చేరింది. కొత్తగా 44 మందిలో వైరస్‌ను గుర్తించారు. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 80,695ను తాకింది. వుహాన్‌ను నిర్బంధంలో ఉంచిన తర్వాత అక్కడ అతితక్కువ కేసులు నమోదుకావడం శనివారమే అని అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా బాధితుల్ని వైద్య పర్యవేక్షణలో ఉంచిన ఓ హోటల్‌ కుప్పకూలింది. ప్రమాద సమయంలో దీంట్లో 70 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 43 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతన్నాయి.

> ఈజిప్టు నైలు నది తీరంలో నిలిపి ఉంచిన నౌకలో మరో 33 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించామని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. గత గురువారం దీన్ని తీరంలో ఆపారు. మరికొంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నౌకలో భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం.  

> మాల్దీవుల్లో ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు ధ్రువీకరించారు. ఆ దేశంలో ఇవే తొలికేసులు కావడం గమనార్హం. వీరు ఇటీవల ఇటలీకి వెళ్లివచ్చినట్లు గుర్తించారు.

> యూకేలో కొత్తగా 46 మందికి వైరస్‌ సోకడంతో బాధితుల సంఖ్య 209కి చేరింది. 

> ఇక యూరప్‌లో కరోనాకు కేంద్రంగా ఉన్న ఇటలీలో శనివారం మరో 36 మంది మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 233కు చేరింది. ఇక కొత్తగా మరో 1,247 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో బాధితుల సంఖ్య 5,883కు చేరింది. వీరిలో 567 మంది ఐసీయూల్లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోటిమందికి పైగా ఉండే లోంబార్డీ ప్రాంతాన్ని పూర్తిగా నిర్బంధంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే మిలన్‌ దీని పరిధిలోకే వస్తుంది.

> ఇటు భారత్‌లో మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకూ భారత్‌లో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 34కి చేరింది.

> ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 104,962 మంది వైరస్‌ బారిన పడ్డట్లు ధ్రువీకరించారు. మరణాల సంఖ్య 3,570 మంది మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 56,903 మంది కోలుకొని ఇంటికి చేరుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని