
తాజా వార్తలు
దిగజారిన చైనా క్షమాపణ చెప్పాలి..
డ్రాగన్ తప్పుడు ట్వీట్.. ఆస్ట్రేలియా గరం గరం
సిడ్నీ: చైనా తమ దేశానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియా సైనికులు.. అఫ్గానిస్థాన్‌లో దురాగతాలు సాగిస్తున్నారంటూ చైనా సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న దుష్రచారాన్ని వెంటనే ఆపాలని ఆయన కోరారు. అంతేకాకుండా చైనా ట్విటర్లో షేర్ చేసిన తమ సైనికుల నకిలీ చిత్రాలను వెంటనే తొలగించాల్సిందిగా హెచ్చరించారు.
ఓ అస్ట్రేలియన్ సైనికుడు, అఫ్గానిస్థాన్ చిన్నారి మెడపై కత్తి పెట్టినట్టు ఉన్న చిత్రాన్ని.. చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ నేడు ట్వీట్ చేశారు. అంతేకాకుండా అఫ్గాన్‌లో సాధారణ ప్రజలు, ఖైదీలను ఆస్ట్రేలియా సైనికులు హత్య చేస్తున్నారని.. వారి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందుకు ఆ దేశం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కాగా, ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా చైనా చేస్తున్న ప్రచారం పట్ల ఆ దేశ ప్రధాని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్య ‘‘నిజంగా అసహ్యకరం’’ అంటూ ఆయన అభివర్ణించారు. చైనా, ఆస్ట్రేలియా సంబంధాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. బీజింగ్ స్పందనను ప్రపంచ దేశాలు గమనిస్తూనే ఉన్నాయని స్కాట్ మోరిసన్ అన్నారు. చైనా తాజా చర్య రెచ్చగొట్టేదిగా ఉందని.. ఏ విధంగా చూసినా ఇది సమర్థనీయం కాదన్నారు. నకిలీ చిత్రాలను షేర్ చేయటం పట్ల చైనా సిగ్గుపడాలని ఆయన హితవు పలికారు. ఇటువంటి ప్రవర్తనతో ప్రపంచ దేశాల ముందు చైనా దిగజారిపోయిందని ఆస్ట్రేలియా ప్రధాని అభిప్రాయపడ్డారు.