రైతుల డిమాండ్లు తీర్చకపోతే భాజపాకు కష్టమే.. గవర్నర్‌ మాలిక్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

తాజా వార్తలు

Published : 19/10/2021 02:05 IST

రైతుల డిమాండ్లు తీర్చకపోతే భాజపాకు కష్టమే.. గవర్నర్‌ మాలిక్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

MSPకి హామీ ఇస్తే  మధ్యవర్తిగా ఉంటానని కేంద్రానికి సూచన

ఝున్‌ఝును: సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న అన్నదాతల డిమాండ్లు నెరవేర్చాలని మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కర్షకుల డిమాండ్లు తీర్చకపోతే భాజపా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ‘‘వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో భాజపా నేతలు పలు గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నారు. నాది మేరఠ్‌. ఆ ప్రాంతంలో భాజపా నేతలు ఏ గ్రామానికీ వెళ్లలేకపోతున్నారు. మేరఠ్‌, ముజఫర్‌నగర్‌, బాఘ్‌పట్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది’’ అని తెలిపారు. రైతుల పక్షాన మాట్లాడుతున్న మీరు పదవికి రాజీనామా చేస్తారా?అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సత్యపాల్‌ మాలిక్‌ స్పందిస్తూ.. ‘‘నేను రైతుల తరఫున నిలబడతా. అందుకోసం నా పదవి వదులుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ అవసరమే వస్తే ఆ పని కూడా చేస్తాను’’ అని వ్యాఖ్యానించారు. 

ప్రధాని, హోంమంత్రితోనూ వాదించా!

పశ్చిమ యూపీకి చెందిన జాట్‌ నేత అయిన సత్యపాల్‌ మాలిక్‌.. రైతుల అంశంపై పలువురు కేంద్ర పెద్దలతో నేతలతో గొడవపడ్డానన్నారు. రైతుల కోసం ప్రధాని, హోంమంత్రి, ప్రతిఒక్కరితోనూ తన వైఖరిని చెప్పానన్నారు. రైతుల విషయంలో మీరు తప్పు చేస్తున్నారు.. అలా చేయొద్దు’’ అని వారితో చెప్పినట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీని ఇస్తే ఈ సమస్య పరిష్కారమైపోతుందని మాలిక్‌ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఈ మూడు సాగుచట్టాలపై స్టే విధించినందున రైతులు కూడా ఆ అంశాన్ని వదిలేయొచ్చని సూచించారు. కేంద్రం కనీస మద్దతు ధర చట్టబద్ధతకు రైతులకు హామీ ఇస్తానంటే.. తాను రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రైతులు తమ ఇళ్లు, భూములకు దూరమై దాదాపు 10 నెలలకు పైగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లను వినాలన్నారు. తాను రైతుల పక్షాన ఉంటానని, అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.

ఉగ్రవాదులు అప్పుడు ఇలాంటి ధైర్యం చేయలేదు..

జమ్మూకశ్మీర్‌లో పౌర హత్యలపైనా ఆయన స్పందించారు. తాను గతంలో జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో శ్రీనగర్‌కు 50కి.మీ- 100కి.మీల పరిధిలోకి వచ్చేందుకు ఉగ్రవాదులు ధైర్యం చేయలేదని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు మాత్రం పేద ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారని.. ఇది బాధాకరమన్నారు.

మరోవైపు, ప్రస్తుతం మేఘాలయ గవర్నర్‌గా ఉన్న 75 ఏళ్ల సత్యపాల్‌ మాలిక్‌.. భాజపాకు ముందు కాంగ్రెస్‌, జనతాదళ్‌, లోక్‌దళ్‌, సమాజ్‌వాదీ పార్టీల్లోనూ పనిచేశారు. రైతు నిరసనలను వేదికగా మలచుకొని ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని